పుత్తూరు: ఏరు దాటాక తెప్ప తగలేసిన చందాన సీఎం చంద్రబాబు వ్యవహార శైలి ఉందని వలంటీర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికలకు ముందు వలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ.10 వేలు ఇస్తామని చెప్పి తమను వీధిన పడేశారని మండిపడుతున్నారు. అన్ని రంగాల ప్రజలను మోసం చేశారని, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తెలుగు తమ్ముళ్ల ద్వారా సొంత డబ్బా కొట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీని తీసుకువచ్చారని, ప్రజల సోమ్మును తమ పార్టీ కార్యకర్తలకు దోచి పెట్టడానికి సిద్ధమయ్యారని దుయ్యబడుతున్నారు. ఈ దుర్మార్గపు నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమని వలంటీర్లు హెచ్చరిస్తున్నారు.
నిరుద్యోగభృతి ఎక్కడ?
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా నిరుద్యోగ భృతి హామీ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు సొంత ప్రచారాల కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీని తీసుకువచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇలా చేయడం ఏ ప్రభుత్వాలకూ అధికారం లేదు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడితే ప్రజా ఉద్యమం తప్పదు.
– టి.రాజేష్, మాజీ వలంటీరు, ఎన్జీఓ కాలనీ, పుత్తూరు
నమ్మించి గొంతు కోశారు
వలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ నమ్మించారు. అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థనే తొలగించి మా గొంతుకోశారు. కనీసం నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3 వేలు అయినా ఇస్తున్నారా అంటే అదీ లేదు. అన్నింటిని గమనిస్తున్న ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం.
– ఎ.జయలక్ష్మీ, మాజీ వలంటీరు, ఆరేటమ్మకాలనీ, పుత్తూరు
బాబుకు వెన్నుపోటు అలవాటే
గతంలో వలంటీర్ల వ్యవస్థ వృథా అని చంద్రబాబు, అమ్మాయిలను మాయం చేస్తున్నారంటూ పవన్‌కళ్యాణ్ ఊదరగొట్టారు. ఓటమికి భయపడి ప్లేటు ఫిరాయించి వలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తామని నమ్మించారు. అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థను తొలగించారు. ఇలా వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.
– టి.రోహిణికుమార్, మాజీ వలంటీరు, అంబేడ్కర్ సర్కిల్, పుత్తూరు
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు కీర్తి గడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ల వేతనాన్ని రూ.10 వేలకు పెంచడం నాదీ బాధ్యత అంటూ ఆనాడు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక పోయినట్లు చంద్రబాబుకు ఓటేయడం ద్వారా తమ ఉద్యోగం ఊడింది. – పి.హరికృష్ణ, మాజీ వలంటీరు, తొరూరు గ్రామం, పుత్తూరు


