కాయ కష్టం | - | Sakshi
Sakshi News home page

కాయ కష్టం

Jun 27 2026 12:25 AM | Updated on Jun 27 2026 12:25 AM

పలుచోట్ల స్తంభించిన కాయల కొనుగోళ్లు

ఫ్యాక్టరీల ఇష్టారాజ్యంతో వేలాదిమంది రైతుల ఆందోళన

జీడీనెల్లూరులో మూడు కిలోమీటర్ల మేర ట్రాక్టర్ల బారులు

అన్‌లోడింగ్‌ కోసం వారం రోజులుగా పడిగాపులు

నీడ, నీరు లేక ట్రాక్టర్ల కిందే బస

మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాయల లోడుతో గుజ్జు ఫ్యాక్టరీల వద్దకు చేరుకుని రోజుల తరబడి రాత్రింబవళ్లు అక్కడే ఉంటున్నారు. కుటుంబాలను వదిలి రోజుల తరబడి రోడ్లపైనే గడపాల్సి వస్తోంది. రాత్రివేళ ట్రాక్టర్ల కిందే నిద్రిస్తున్నారు. ఒకవైపు కాయల నష్టం, మరోవైపు భద్రతపై ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ క్రమంలోనే గుడిపాలలోని ఓ ఫ్యాక్టరీ వద్ద నిద్రిస్తున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ బుధవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.

జీడీ నెల్లూరులోని ఫ్యాక్టరీ వద్ద

బారులు తీరిన మామిడి కాయల ట్రాక్టర్లు

ట్రాక్టర్‌ కిందే కునుకు తీస్తున్న రైతు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో మామిడికి గండం ముంచుకొచ్చింది. ప్రధానంగా తోతాపురి కన్నీళ్లు తెప్పిస్తోంది. కాయల కొనుగోలు స్తభించి.. కర్షకులకు కష్టాలు పెట్టిస్తోంది. ఈవిషయంలో ఫ్యాక్టరీలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. గుడిపాలోని ఫ్యాక్టరీ ల్లో తమిళనాడు కాయల వ్యాపారం జోరందుకుంటోంది. అక్కడ కాయల కొనుగోలు పరిస్థితి దారుణంగా తయారైంది. అన్‌లోడింగ్‌కు వారం రోజులు పడుతోంది. అవస్థల నడుమ రైతులు కాయల కాడే కునుకుతీస్తున్నారు.

జిల్లాలో 59 హెక్టార్లలో మామిడి సాగు ఉంది. ఇందులో తోతాపురి రకం 41 హెక్టార్లల్లో ఉండగా.. ప్రస్తుతానికి 25 శాతం కాయలు కోతకొచ్చాయి. ఇప్పటికే కొనుగోలు సక్రమంగా లేక రైతులు విలవిలలాడిపోతున్నారు. ఫ్యాక్టరీ వద్దకు కాయలు తీసుకెళితే టోకన్లు, వరుస నంబర్లు, సిఫార్సులంటూ...అయోమయానికి గురి చేస్తున్నారు. దీంతో రైతులు దిక్కు తోచక అల్లాడిపోతున్నారు. ప్రత్యేకించి జీడీ నెల్లూరు, గుడిపాల ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. బుధవారం సాయంత్రం నుంచి జీడీనెల్లూరులోని ఓ పల్ప్‌ ఫ్యాక్టరీ కొనుగోళ్లు నిలిపివేయడంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర 600లకు పైగా ట్రాక్టర్లు వరుసగా నిలిచిపోయాయి. కొందరు రైతులు నాలుగు రోజులుగా, మరికొందరు వారం రోజులుగా అన్‌లోడింగ్‌ కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుడిపాలలో...

గుడిపాలలో సామాన్య రైతుల ట్రాక్టర్లు క్యూల్లోనే ఉండిపోతుంటే, తమిళనాడు నుంచి వచ్చే లారీలను ఫ్యాక్టరీల ఆవరణలోకి తీసుకెళ్లి దాచిపెడుతున్నారు. వెనువెంటనే అన్‌లోడింగ్‌ చేస్తున్నారు. సామాన్య రైతు ట్రాక్టర్లను మాత్రం అడపదడప గుంపులో గోవిందా అంటూ.. పరుగులు పెట్టిస్తున్నారు. ఈక్రమంలో నువ్వా.. నేనా అంటూ రైతులు పోటీపడుతున్నారు.

ట్రాక్టర్‌ డ్రైవర్‌ దుర్మరణం

యాదమరి మండలం కొటాల దళితవాడకు చెందిన అనీల్‌కుమార్‌(30) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొటాల గ్రామంలో నుంచి బుధవారం ట్రాక్టర్‌లో మామిడికాయలు తీసుకొని గుడిపాల మండలంలోని 189కొత్తపల్లె గ్రామం సమీపంలో ఉన్న తాసా జ్యూస్‌ ఫ్యాక్టరీకి మామిడికాయలను తీసుకుచ్చాడు. ట్రాక్టర్‌ వెనుక భాగంలో నిద్రిస్తున్న అనీల్‌కుమార్‌పై బుధవారం అర్ధరాత్రి ట్రాక్టర్‌ ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

వరుస నంబర్లకే పరిమితమైన అధికారులు

ఫ్యాక్టరీల వద్ద విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ సిబ్బంది కేవలం వరుస నంబర్లు కేటాయించడానికే పరిమితమవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. క్యూలను పర్యవేక్షించడం, సిఫార్సుల జోక్యాన్ని అడ్డుకోవడం, అక్రమాలకు చెక్‌ పెట్టడం వంటి అంశాల్లో అధికారులు చొరవ చూపడం లేదని వాపోతున్నారు.

వీఐపీ తరహాలో..

జీడీనెల్లూరులో సిఫార్సులకే ప్రాధాన్యం దక్కుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల సిఫార్సు ఉంటేనే త్వరగా అన్‌లోడింగ్‌ అవకాశం లభిస్తోందని రైతులు చెబుతున్నారు. లేదంటే రూ.500 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సామాన్య రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ‘వీఐపీ దర్శనం‘ తరహాలో కాయల అన్‌లోడింగ్‌ జరుగుతోందని రైతులు ఎద్దేవా చేస్తున్నారు.

ట్రాక్టర్ల కిందే బస...

తిండికి తిప్పలు

అన్‌లోడింగ్‌ కోసం వేచి చూస్తున్న రైతులు చాలాచోట్ల నీడ లేకపోవడంతో మండుటెండల్లోనే రోజంతా గడుపుతున్నారు. రాత్రివేళ ట్రాక్టర్ల కిందే నిద్రిస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి కోసం ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి ట్రాక్టర్లు రోడ్లపైనే నిలిచిపోవడంతో మరో సమస్య రైతులను వేధిస్తోంది. ట్రాక్టర్లలోని బ్యాటరీలు, డీజిల్‌, ఇతర విడిభాగాలు చోరీకి గురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఒకవైపు కాయల నష్టం, మరోవైపు ట్రాక్టర్‌ భద్రతపై ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

మామిడి రైతు పడిగాపులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement