అయ్య బాబోయ్‌.. ఫీజులు | - | Sakshi
Sakshi News home page

అయ్య బాబోయ్‌.. ఫీజులు

Jun 27 2026 12:25 AM | Updated on Jun 27 2026 12:25 AM

● కార్పొరేట్‌ పాఠశాలల్లో దోపిడీ పర్వం ● ఇష్టానుసారంగా విద్యాసామగ్రి అమ్మకాలు ● వ్యాపార కేంద్రాలుగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లు ● తనిఖీలు చేయని విద్యాశాఖ అధికారులు

కుప్పానికి చెందిన రమణకుమార్‌ తన కుమారుడిని ఏడో తరగతిలో చేర్పించడానికి పట్టణంలో ఉన్న ఒక కార్పొరేట్‌ పాఠశాలకు వెళ్లారు. ఫీజు రూ.80 వేలు, దుస్తులు, పుస్తకాలకు మరి కొంత అదనంగా చెల్లించాలని సిబ్బంది చెప్పారు. దీంతో ఆయన ఆందోళన చెందారు.

చిత్తూరుకు చెందిన వివేకానంద తన కుమార్తెను ఓ కార్పొరేట్‌ పాఠశాలలో పదో తరగతిలో చేర్పించాలని ప్రయత్నించారు. విద్యార్థినికి పరీక్ష నిర్వహిస్తామని, మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తామని పాఠశాల యాజమాన్యం చెప్పింది. పరీక్షలో మంచి మార్కులు సాధించినా రూ.1.10 లక్షల ఫీజు కట్టాలని చెప్పడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఆయన ఉండిపోయారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్‌ బడుల్లో పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకటో తరగతికి కట్టే ఫీజులతో డిగ్రీ, పీజీ సైతం పూర్తి చేయవచ్చని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా 5 నుంచి 10 శాతం ఫీజులు పెంచుతున్నారని వాపోతున్నారు. యూనిఫాం దుస్తులు, పాఠ్య, నోటు పుస్తకాలు, బ్యాగ్‌ తదితర సామగ్రి మొత్తం తమ స్కూల్లోనే కొనాలంటూ నిబంధనలు పెడుతూ దోపిడీకి పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

కనిపించని తనిఖీలు

సాధారణంగా ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అధికారులు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. వసతులపై ఆరా తీయాలి. ఇష్టానుసారంగా ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు అవుతున్నా విద్యాశాఖ అధికారులు పాఠశాలలను తనిఖీ చేసిన దాఖలాలు లేవు. నిబంధనలు పాటించని పాఠశాలలకు అడ్డగోలుగా గుర్తింపునిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం సైతం పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫీజుల దోపిడీపై జిల్లాలో పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఉచిత సీట్లకూ ఫీజుల వసూలు

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదలకు ఉచితంగా కేటాయించాలి. ఉచిత సీట్లు పొందిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు పలు రకాల ఫీజులంటూ వసూలు చేస్తున్నారు. దీనిపై విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగితాల్లోనే కమిటీలు

ప్రైవేటు పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు చేయాలని నిబంధనలు చెబుతున్నా.. వాటి ఊసే లేదు. ఏడాదికి ఒకటి, రెండుసార్లు పేరెంట్స్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు తప్ప కమిటీలను ఏర్పాటు చేయడం లేదు. కమిటీ సభ్యుల వివరాలు, తీర్మానాలను ఎంఈవో అనుమతితో డీఈవోకు అందజేయాలి. కమిటీ సిఫార్సులను నోటీసు బోర్డులో ఉంచాలి. అవి ఎక్కడా మచ్చుకై నా కనిపించడం లేదు.

కానరాని బోర్డులు

ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ఫీజుల వివరాలను బోర్డుల్లో రాసి ప్రతి ఒక్కరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. ఏ తరగతికి ఎంత ఫీజు కట్టించుకుంటున్నారు, పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల అర్హతల వివరాలు, విద్యాశాఖ అధికారుల పేర్లు, ఫోన్‌ నంబర్లు రాయాలి. ప్రైవేటు పాఠశాలల్లో ఇవేమీ కనిపించడం లేదు.

జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలలు

ప్రాథమిక పాఠశాలలు 161

ప్రాథమికోన్నత పాఠశాలలు 85

ఉన్నత పాఠశాలలు 185

మొత్తం పాఠశాలలు 431

ఇష్టానుసారంగా వసూళ్లు

జిల్లాలోని ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తున్నారు. అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నా విద్యాశాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. స్కూల్‌ ప్రాంగణాల్లోనే పుస్తకాలు, యూనిఫాం, బెల్టులు, షూస్‌ వంటివి మార్కెట్‌ ధరకంటే ఎక్కువకు అమ్ముతున్నారు. ప్రాంగణంలో అమ్మకాలు చేయడం చట్టవిరుద్ధమని తెలిసినా ఆపడం లేదు. కలెక్టర్‌ చొరవ తీసుకుని అడ్డగోలు ఫీజుల వసూళ్లు, అమ్మకాలను అరికట్టేందుకు విస్తృత తనిఖీలు చేయించాలి.

– సద్దాం, జిల్లా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ జేఏసీ చైర్మన్‌, చిత్తూరు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement