చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–1 కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలో 33 మందికి పదోన్నతులు లభించాయి. వీరిని జోన్–4 పరిధిలోని జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాలకు బదిలీ చేశారు. అక్కడ కలెక్టర్లు వారికి పంచాయతీలను కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో వివరించారు.
నిబంధనలు పాటించాలి
చిత్తూరు కలెక్టరేట్ : భూ వివాదాల సర్వేలో నిబంధనలు పాటించాలని సర్వేశాఖ డీడీ జయరాజ్ తెలిపారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లో సర్వే అధికారులు, సిబ్బందికి ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని భూ వివాదాలపై క్షేత్రస్థాయిలో సర్వే చేసేటప్పుడు ఖచ్చితమైన నియమ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్, ఎఫ్ లైన్స్, పట్టా సబ్ డివిజన్, ఆన్‌లైన్ సబ్ డివిజన్, రీసర్వే తదితర పనులు చేపట్టినప్పుడు అర్జీదారులతో సర్వే సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ఆదేశించారు. అర్జీలను పరిష్కరించే క్రమంలో పాటించాల్సిన విధానాలు, పద్ధతులు, సమస్య పరిష్కారం తర్వాత ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ముఖ్యమన్నారు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్‌మెంట్లపై పలు సూచనలు చేశారు. ఈ వర్క్‌షాప్‌లో పలువురు మండల సర్వేయర్లు క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను డీడీ దృష్టికి తీసుకెళ్లారు. రీసర్వే ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చే విస్తీర్ణ సవరణ అర్జీలను పరిష్కరించేందుకు గడువు పెంచాలని పెద్దపంజాణి మండల సర్వేయర్ కోరారు. ఈ వర్క్‌షాప్‌లో జిల్లా సర్వే శాఖ అధికారి పుల్లయ్య, ఇన్‌స్పెక్టర్ చిట్టిబాబు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ రమణారెడ్డి, కృష్ణమూర్తి, రవిచంద్ర, ప్రసాదరావు పాల్గొన్నారు.


