అయ్యోర్ల సర్దుబాటుకు కసరత్తు | - | Sakshi
Sakshi News home page

అయ్యోర్ల సర్దుబాటుకు కసరత్తు

Jun 27 2026 12:25 AM | Updated on Jun 27 2026 12:25 AM

● విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నియామకాలు ● నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా అధికారుల చర్యలు

చిత్తూరు కలెక్టరేట్‌ : చిత్తూరు జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1,52,643 మంది విద్యార్థులు ఒకటి నుంచి పదవ తరగతి వరకు విద్యనభ్యసించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,26,771 మంది ఉన్నారు. ఈ ఏడాది 1.60 లక్షల మందికి అడ్మిషన్లు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులను పాఠశాలలకు సర్దుబాటు చేయడానికి సిద్ధమయ్యారు. గత ఏడాది జిల్లాలోని మోడల్‌ ప్రైమరీ స్కూళ్లకు తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఐదుగురిని నియమించారు. ఈ విద్యాసంవత్సరం వాటిలో విద్యార్థుల అడ్మిషన్లు తగ్గితే అదనంగా ఉన్న ఉపాధ్యాయుడిని మరోచోటికి పంపిస్తారు. అలాగే బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌ (బీపీఎస్‌)లో విద్యార్థుల సంఖ్య 60కి దాటితే మోడల్‌ ప్రైమరీ స్కూల్‌గా గుర్తించి నలుగురు టీచర్లను కేటాయిస్తారు. ప్రస్తుతం జిల్లాలోని అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేరు. ముఖ్యంగా కుప్పం, పలమనేరు, నగరి, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు తగ్గాయి. ఈ సమస్యను పరిష్కరించడంతోపాటు అడ్మిషన్ల సంఖ్యను పెంచడానికి సర్దుబాటు ప్రక్రియను చేపట్టినట్టు అధికారులు తెలిపారు. శాంక్షన్‌ పోస్టు ఉండి టీచర్‌లేని పాఠశాలలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నామని పేర్కొన్నారు.

విభజన ప్రక్రియలోపు పూర్తి చేసేలా..

వచ్చే నెలలో జిల్లాల వారిగా టీచర్ల విభజన ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. ఈలోపు సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేపట్టారు. ముందుగా ప్రతి మండలంలోనూ మిగులు టీచర్లను అదే మండలంలో అవసరమైన చోటికి మారుస్తారు. తర్వాత డివిజన్‌ స్థాయిలో అదనంగా ఉన్న వారిని ఇతర మండలాలకు పంపిస్తారు. మినిమం టైం స్కేల్‌ (ఎంటీఎస్‌) టీచర్లనూ సర్దుబాటు చేసేందుకు జాబితా రూపొందించారు. ఈ ప్రక్రియలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 350 వరకు టీచర్లకు స్థానచలనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 30వ తేదీలోపు సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా టీచర్లను నియమించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈనెల 20వ తేదీ నాటికి విద్యార్థుల అడ్మిషన్లను పరిగణలోకి తీసుకుని ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తు చేపట్టారు. టీచర్లు అదనంగా ఉన్న చోటి నుంచి అవసరమైన చోటుకు మార్చనున్నారు.

పకడ్బందీగా సర్దుబాటు ప్రక్రియ

ఉన్నతాధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సర్దుబాటు ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నాం. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం. నిర్దేశించిన గడువులోపు ఈ తతంగాన్ని పూర్తిచేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతాం.

– వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జి డీఈవో

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement