పక్కా ప్లాన్‌తోనే గంగవరం లాడ్జిలో బస బాధితునికి కదలికలపై రెక్కీ సముద్రపల్లి తోపులో ఉండగా కిడ్నాప్ స్థానికుల గుట్టున రట్టు చేస్తామంటున్న పోలీసులు
పలమనేరు: ఇంటర్నేషనల్ ట్రేడర్ ఎంసీ రవిని కేరళ పోలీసుల వేషంలో వచ్చిన దుండగులు ఈ నెల 7న కిడ్నాప్ చేశారు. అతని నుంచి రూ.కోటి నగదు, 900 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని వదిలిపెట్టిన విషయం విదితమే. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పట్టణ సీఐ మోహన్‌రెడ్డి తన బృందంతో శాసీ్త్రయ పద్ధతులతో అంతర్రాష్ట్ర ముఠాలో కొందరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో దుండగులకు స్థానికంగా సహకరించిన వారెవరనేది ఒక ప్రశ్నలా మారింది. వారికి పక్కాగా సమాచారం ఇవ్వకపోతే అటవీ ప్రాంతంలో స్నేహితులతో కలిసి పార్టీలో ఉన్న రవిని ఎలా కిడ్నాప్ చేస్తారని పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు.
లైవ్ లొకేషన్ ద్వారా పక్కాగా కిడ్నాప్
జాతరకు వచ్చిన రవి పలమనేరు మండలంలోని అడవి సమీపంలో ఉనన మామిడి తోపులో పార్టీ చేసుకుంటున్న విషయం అతని 20 మంది స్నేహుతులకు మాత్రమే తెలుసు. అదే తోపులోకి భానుప్రకాష్ వెళ్లి మామిడికాయలు కొంటామంటూ రవి ఉన్న విషయాన్ని చేరినట్టు చేసినట్టు తెలిసింది. ఆపై కేరళ పోలీసుల వేషంలోని ముఠా రవి కారును అడ్డగించి కిడ్నాప్ చేసింది. రవితో పాటు ఉన్న వారిలో ఎవరైనా లైవ్ లొకేషన్ సెండ్ చేశారా? లేక పార్టీకి రాని వారు కిడ్నాపర్లతో ఉంటూ ప్లాన్ చేశారా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సింది. ఈ విషయమై పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ కిడ్నాపర్లకు సహకరించిన స్థానికులపై పక్కా సాక్ష్యంతో త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పడం గమనార్హం. దీంతో రవి స్నేహితులతోపాటు, రవి విషయంలో ఉప్పందించిన వారిలో టెన్షన్ మొదలైంది.
స్థానికులే సహకరించారా..?
బెంగళూరులో ఉంటున్న రవి స్వగ్రామం గంగవరంలో జరిగే గంగ జాతరకు వస్తున్నానని ముఖ్య స్నేహితులకు వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పెట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తనకు డబ్వులివ్వకుండా మోసం చేస్తున్నాడని చెబుతున్న తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన సుంకర మహేష్‌నాయుడు పలుమార్లు రవి కోసం వచ్చాడు. అతను దొరకకపోవడంతో స్నేహితులకు విందు ఇచ్చినట్టు తెలిసింది. రవి ఎప్పుడు ఇక్కడికి వచ్చినా తాము సమాచారం ఇస్తామని వారు ఒప్పుకున్నట్టు సమాచారం. జాతరకు రవి వస్తున్నాడనే విషయం ముందుగా తెలిసిన వారే మహేష్‌నాయుడుకు చేరవేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ద్వారకా తిరుమలకు చెందిన భానుప్రకాష్ కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన ఉప్పలూరు నాగేశ్వర్‌రెడ్డికి చెప్పాడని, అతని ద్వారా కేరళ గ్యాంగ్ కలిసి జాతరకు ముందుగానే గంగవరంలోని ఓ లాడ్జిలో మకాం వేసినట్టు సమాచారం. వారికి స్థానికంగా ఉన్న ఒక వ్యక్తే లాడ్జిని తీసిచ్చినట్టు తెలిసిందే.


