పుత్తూరులో వ్యాపారి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పుత్తూరులో వ్యాపారి ఆత్మహత్య

Jun 27 2026 12:25 AM | Updated on Jun 27 2026 12:25 AM

● యాప్‌లోన్‌ తీసుకుని కట్టలేకపోవడమే కారణమా? ● యాప్‌లోన్‌ నిర్వాహకుల ఒత్తిళ్లు? ● మృతుడు రాసివుంచిన ఫిర్యాదు పత్రం

● యాప్‌లోన్‌ తీసుకుని కట్టలేకపోవడమే కారణమా? ● యాప్‌లోన్‌ నిర్వాహకుల ఒత్తిళ్లు? ● మృతుడు రాసివుంచిన ఫిర్యాదు పత్రం

పుత్తూరు : మధ్య తరగతి కుటుంబాల వారు తీసుకునే యాప్‌ లోన్లు యమపాశాల్లా మారుతున్నాయి. యాప్‌ నిర్వాహకుల ఒత్తిళ్లను భరించలేక బాధితులు ఎక్కడో ఒకచోట ప్రాణాలు తీసుకుంటున్నారు. వాటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఇలాంటి సంఘటనే పుత్తూరు పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో కూల్‌డ్రింక్స్‌ దుకాణం నిర్వహిస్తున్న మహదేవ్‌ రాయల్‌ (53) తన దుకాణంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. అతను డిజిటల్‌ రుణ సేవ ద్వారా అప్పు తీసుకున్నట్లు తెలిసింది. రుణం చెల్లింపులో జాప్యం కావడంతో యాప్‌ ప్రతినిధులు గురువారం సాయంత్రం దుకాణానికి వచ్చి బెదిరింపులకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. మహదేవరాయల్‌ పోలీసులకు ఇవ్వడానికి సిద్ధం చేసి ఉంచిన ఫిర్యాదు పత్రం దీనికి బలం చేకూరుస్తోంది. అందులో తాను తన భార్య వరలక్ష్మి పేరు మీద కొన్ని నెలల క్రితం ‘భారత్‌ ఫోన్‌‘ అనే లోనే యాప్‌ ద్యారా లోను తీసుకున్నట్టు తెలిపాడు. అనివార్య కారణాల వల్ల లోన్‌ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోయానని పేర్కొన్నాడు. దీంతో యాప్‌ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారని, డబ్బు చెల్లించకపోతే తన భార్య, తన ఫొటోలను మార్పింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించినట్టు వాపోయాడు. ఆ ఫొటోలను ఐదుగురు వ్యక్తులకు షేర్‌ చేశారని తెలిపాడు. వారు తమ అంగడి వద్దకు వచ్చి గొడవ చేశారని వాపోయాడు. వారెవరో తమకు తెలియదని తెలిపాడు. ఇలా ఫొటోలను పంపించడంతో తీవ్ర మానసిక క్షోభకు గురైనట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు ఏదైనా జరిగితే భారత్‌ ఫోన్‌ యాప్‌ లోన్‌ తరపున మాట్లాడుతూ బెదిరింపులకు గురిచేస్తున్న మహిళదే బాధ్యత అని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. అప్పుల ఒత్తిడి లేదా బెదిరింపులే ఆత్మహత్యకు కారణమన్న విషయంపై ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

ఎస్‌ఐకి రాసిన ఫిర్యాదు పత్రం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement