ఒకే కుటుంబానికి చెందిన
నలుగురు మృతి
మరికొందరి పరిస్థితి విషమం
పెళ్లికి బయల్దేరి మృత్యుఒడికి
కన్నీరుమున్నీరవుతున్న బంధువులు
సహాయక చర్యల్లో పోలీసులు, స్థానికులు
ఆ నలుగురూ రక్త సంబంధీకులే. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం వారిది. బంధువుల పెళ్లికని సంతోషంగా ఆటోలో బయల్దేరారు. అందరికన్నా ముందు తామే ఉండాలని ఉబలాట పడ్డారు. కానీ వారి ఆనందం ఆవిరయ్యింది. మార్గ మధ్యంలో లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని పొట్టనబెట్టుకుంది. వారిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిలింది. ఈ ఘటన పాకాల మండలం, గుంతగాందంకి వద్ద బుధవారం చోటుచేసుకుంది.
దారి కాచిన మృత్యువు
ముందుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా సిగ్నల్ ఇవ్వకుండా ఆగిపోవడంతో వెనుక వస్తున్న ఆటో లారీని బలంగా ఢీకొట్టింది. ఆటో ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్ పక్కన కూర్చున్న రాజశేఖర్ చనిపోగా.. సూర్యబాబు ప్రాణాలతో బయటపడ్డాడు. అలాగే వెనుక కూర్చున్న మాధవి, మేఘన, బేబి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. మధ్యలో ఉన్న వ్యక్తులు మాత్రం రక్తగాయాలతో బయటపడ్డారు. లారీ ఢీకొట్టిన సమయంలో ఆటోలో ఇరుక్కపోయి ఇద్దరు..విగతజీవులు కనిపించారు. క్షత్రగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మృతదేహాలు, క్షత్రగాత్రులను తిరుపతి రుయాకు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రెండు గ్రామాల ప్రజలు హుటహుటిన తిరుపతి రుయా ఆస్పత్రికి పరుగులు పెట్టారు.
పెళ్లి బాజాలు చూడకనే..!
పెళ్లి వేడుకకు వెళ్లేందుకు మాధవి తమ్ముడు ఆటోను ఏర్పాటు చేశాడు. మాధవి కొడుకు, కూతురిని తీసుకుని తమ్ముడి పిలుపు మేరకు పెరుమాళ్లపల్లి గ్రామానికి చేరకుంది. అక్కడి నుంచి మాధవి తమ్ముడు, తల్లి, తండ్రితో పాటు బంధువులు కలిసి గంగాధరనెల్లూరు మండలం నెల్లేపల్లి గ్రామానికి చెందిన సుబ్రమణ్యం ఆటోలో పెళ్లి వేడుకకు బయలుదేరారు. మాధవి భర్తను ఇంటివద్దే వదిలేసి, పిల్లలు, బంధువులతో కలిసి బయల్దేరింది. కానీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వారి ప్రయాణం శాశ్వతంగా ఆగిపోయింది.
నుజ్జునుజ్జు అయిన ఆటో
కాణిపాకం: దారి కాచిన మృత్యువు ఆ కుటుంబాన్ని చిదిమేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని మృత్యుఒడికి చేర్చింది. పాకాల మండలం, గుంతగాదంకి ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన యాదమరి, చిత్తూరు రూరల్ మండలాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలు.. చిత్తూరు మండలం, ఏనుగుంట్లపల్లి గ్రామానికి చెందిన మాధవి బావ కొడుకుకి తిరుపతి జిల్లా, రామచంద్రాపుర మండలంలో గురువారం ఉదయం 5–6గంటల మధ్య పెళ్లి జరనుంది. ఈ పెళ్లికి మాధవి, కుమార్తె, కుమారుడుతో పాటు మాధవి తల్లి, తమ్ముడు, తండ్రితో పాటు బంధువులు బయలు దేరారు. బుధవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో గుంత గాదంకి సమీపంలో మృత్యువు కబలించింది.
పొట్టన పెట్టుకున్న లారీ
చిత్తూరు మండలం, ఏనుగుంట్లపల్లి గ్రామానికి చెందిన కన్నయ్య కుటుంబం కూలినులతో జీవనం సాగిస్తోంది. కన్నయ్య భార్య మాధవి (37) దినసరి కూలీ. వారి కుమార్తె మేఘన (15) పలమనేరులోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మాధవి తల్లి యాదమరి మండలం, పెరుమాళ్లపల్లి గ్రామానికి చెందిన బేబి(54), అలాగే ఆమె కుమారుడు రాజశేఖర్ (22) కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. మాధవి కుమారుడు సూర్యబాబు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతను పీలేరు సంక్షేమ హాస్టల్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మరికొందరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఆర్థిక కష్టాల మధ్య విషాదం
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని మాధవి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కుమార్తెను వెంట తీసుకెళ్లి పెళ్లిలో పాల్గొనాలన్న ఆ తల్లి ఆశ.. చివరకు విషాదంగా ముగిసింది. కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్న మాధవి మరణంతో భర్త కన్నయ్య, కుమారుడు సూర్యబాబు కన్నీరుమున్నీరవుతున్నారు. రాజశేఖర్‌కు తన అక్క కూతురిని కట్టబెట్టాలని చూసిన తల్లి బేబి కల నెరవేరకుండానే పోయింది.
రఘు
గ్రామంలో విషాదం
మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ప్రభుత్వ సహాయం అవసరమని గ్రామస్తులు కోరుతున్నారు. దహన సంస్కారాలపై కూడా గ్రామస్తులు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. పెళ్లి జరగాలా లేదా అన్నది కూడా ఇంకా అనిశ్చితంగానే ఉంది. పెళ్లి ఆనందం కోసం బయలుదేరిన ఆ కుటుంబం చివరకు శవాలుగా తిరిగి రావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సుబ్రమణ్యం
పాకాల మండలం గుంతగాదంకి వద్ద ఘోర ప్రమాదం


