చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇప్పటి వరకు ఉన్న 50 వార్డులను పునర్విభజన చేసి 60 డివిజన్లుగా మార్చాలని మూడు నెలల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికారులు రెక్కలు కట్టుకుని అధికార పార్టీ నేతలకు జీహుజూర్ అంటూ వార్డుల వి‘భజన’ చేశారు. వైఎస్సార్ సీపీ నేతల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని ఎక్కడా భావించలేదు. ప్రతిపక్ష పార్టీ నేతలు జ్ఞానజగదీష్, ఆను, లోకనాథం, ఇమ్రాన్, నారాయణమూర్తి తదితరులు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం 2027 జనాభా లెక్కల సేకరణ జరుగుతోందని, అది పూర్తికాకముందే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల బీసీలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2027 జనగణన నిబంధనల ప్రకారం 2025 డిసెంబర్ 31 లోపు ఎన్నికల సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని, 2026 జనవరి 1 నుంచి 2027 ఏప్రిల్ 1 వరకు జనగణన నిర్వహించనున్న నేపథ్యంలో మొత్తం ప్రక్రియను ఫ్రీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు స్పష్టంగా తెలియజేసిందన్నారు. అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ వార్డుల విభజన చేయడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో హైకోర్టు వార్డుల పునర్విభజన ప్రక్రియపై స్టే విధించింది.
ఆగని సిఫార్సుల దందా..!
ఇష్ట్రపకారం సరిహద్దులు నిర్ణయించారు. కొన్ని వార్డుల్లో కొన్ని సామాజిక వర్గాలు కనిపించనేలేదు. దీనిపై వచ్చిన అభ్యంతరాలను లెక్కలోకి తీసుకోలేదు. ఫలితంగా చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్‌లో అధికారులు రూపొందించిన 60 వార్డుల పునర్విభజన ప్రక్రియకు హైకోర్టు బ్రేకులు వేసింది. న్యాయపోరాటం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు సరిహద్దులు మార్చేసిన అధికారులు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది.


