కూరగాయలకు చుక్కెదురు | - | Sakshi
Sakshi News home page

కూరగాయలకు చుక్కెదురు

Jun 25 2026 1:42 AM | Updated on Jun 25 2026 1:42 AM

● క్రిమి సంహారకాలున్నాయంటూ వెనక్కి ● హైబ్రిడ్‌ టమాటాలకు తప్పని దెబ్బ ● టేబుల్‌ వైరెటీ మామిడిని సైతం తిప్పి పంపుతున్న వైనం

పలమనేరు: పలమనేరు ప్రాంతంలో ఎక్కువగా హైబ్రిడ్‌ టమాటా, బీన్సు, పొటాటో, వంగ, క్యారెట్‌, నిమ్మ, దోస, క్యాప్సికం, చిక్కుడు, కాకర, బీర, గుమ్మడి, కాలీఫ్లవర్‌, ముళ్లంగి, సొరకాయ, కరివేపాకు, బీట్రూట్‌ తదితర కూరగాయల పంటల సాగు చేస్తున్నారు. వీటి సాధారణ సాగు 3 వేల హెక్టార్లు. ఈ ప్రాంత వాతావరణం వీటి సాగుకు అనుకూలంగా ఉండడంతో సీజన్‌తో సంబందం లేకుండా రైతులు సాగు చేస్తుంటారు. ఈ సరుకు బయటి రాష్ట్రాలకే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇటీవల రైతులు ఎక్కువగా పురుగు మందులు వినియోగిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా 270 రకాల సస్యరక్షణ మందులను నిర్దేశించిన మోతాదులో పంటలకు వాడాలనే నిబంధన ఉంది. రైతులు అధిక దిగుబడుల కోసం విచక్షణారహితంగా పురుగు మందులను వాడుతున్నారు. దీంతో మన కూరగాయలు విదేశాల నుంచి వెనక్కి వస్తున్నాయి.

పాడవుతున్న భూమి

మరోవైపు మితిమీరిన రసాయనిక ఎరువులతో భూములు నిస్సారం అవుతున్నాయి. ముఖ్యంగా మట్టిలో సేంద్రియ కర్బనం తగ్గిపోతోంది. ఇలాంటి పొలాల్లో సాగైన పంట ఉత్పత్తులను వినియోగించేవారికి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందనే మాట గట్టిగా వినిపిస్తోంది. దీనిపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

జిల్లాలోనే కూరగాయల సాగులో పలమనేరు హార్టికల్చర్‌ డివిజన్‌ ముందంజంలో ఉంది. పొరుగునే ఉన్న కర్ణాటకలో ఇప్పటికే కూరగాయల సాగులో మంచి దిగుబడులు సాధిస్తున్న రైతుల స్పూర్తితో ఇక్కడి రైతులు పలు రకాల కూరగాయలను ఇక్కడ సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే కూరగాయల్లో ఫర్టిలైజర్‌ అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు లేవని చెబుతూ వెనక్కి పంపేస్తున్నారు. దీంతో వ్యాపారులు సరుకును కొనేందుకు ముందుకు రావడంలేదు. ఫలితంగా కూరగాయల ధరలపై ప్రభావం పడుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement