డీఈవో నియామకమెన్నడో..? | - | Sakshi
Sakshi News home page

డీఈవో నియామకమెన్నడో..?

Jun 25 2026 1:42 AM | Updated on Jun 25 2026 1:42 AM

సీఎం సొంత జిల్లాలో విద్యావ్యవస్థ అస్తవ్యస్థం

నెల పూర్తి కావస్తున్నా డీఈవో పోస్టు ఖాళీ

జిల్లాలో విద్యావ్యవస్థ పర్యవేక్షణ గాలికి

ఇదేనా సీఎం చంద్రబాబు విద్యకిచ్చే ప్రాధాన్యత?

చిత్తూరు కలెక్టరేట్‌ : రాష్ట్రంలో విద్యా సంస్కరణలు, నాణ్యమై న విద్య అంటూ గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులో విద్యావ్యవస్థ కుంటుపడుతోంది. తండ్రి సీఎం, కుమారుడు విద్యాశాఖ మంత్రి ఇద్దరు ముఖ్యమైన ప్రజాప్రతినిధుల సొంత జిల్లాలో కీలకమైన డీఈవో పోస్టును భర్తీ చేయకుండా అలసత్వం వహిస్తున్నారు. కనీసం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడానికి కూడా జిల్లాపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా విద్యాశాఖలో ఇలాంటి దౌర్భాగ్య దుస్థితి నెలకొనడంపై ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

జోరుగా లాబీయింగ్‌

డీఈవో పోస్టింగ్‌ కోసం తెరవెనుక రాజకీయాలు జోరుగా సాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు మాజీ డీఈవోలు (ఇందులో ఒకరు ఏడీ కేడర్‌) ఈ కీలకమైన పోస్టును దక్కించుకోవడానికి తీవ్రంగా లాబీయింగ్‌ చేస్తున్నారు. వారిలో ఒకరికి బీజేపీ రాష్ట్ర నేతల మద్దతు ఉండగా, మరొకరికి జనసేన పార్టీ ముఖ్యనేతల మద్దతు ఉన్నట్లు సమాచారం. కూటమిలోని మిత్రపక్షాలు ఇద్దరు వేర్వేరు అధికారుల కోసం పట్టుబడుతుండడంతో, సొంత జిల్లా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎటూ తేల్చలేక తలపట్టుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ నియామకం వారాల తరబడి పెండింగ్‌లో పడిందని విద్యాశాఖ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతోంది. అలాగే ఇద్దరు డైట్‌ లెక్చరర్లు సైతం పోస్టు కోసం పోటీ పడుతున్నారు. డీఈవో పోస్టు భర్తీపై ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు.

పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ పాఠశాలలు

జిల్లాలో విద్యాశాఖ పర్యవేక్షణ కరువవడాన్ని ఆసరాగా తీసుకున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు రెచ్చిపోతున్నాయి. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, కనీస వసతు లు లేని ప్రైవేట్‌ పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. సీఎం సొంత జిల్లాలోనే విద్యావ్యవస్థ ను గాలికొదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా రాజకీయ లాబీయింగ్‌లను పక్కనబెట్టి, జిల్లాకు తక్షణమే సమర్థుడైన రెగ్యులర్‌ డీఈవోను నియమించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

జిల్లాలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టడంలో డీఈవో పాత్ర కీలకం. విద్యాసంవత్సరం ప్రారంభంలో సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపు, మధ్యాహ్న భోజనం అమలు తీరు, పాఠశాలల్లో మౌలిక వసతుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారం, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల కట్టడి, అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు, కొత్త పాఠశాలలకు అనుమతులు తదితర ముఖ్యమైన పనులు డీఈవో చేయాల్సి ఉంటుంది. మే 31వ తేదీన గత డీఈవో రాజేంద్రప్రసాద్‌ ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి డీఈవో పోస్టును భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు.

పెండింగ్‌లో ఫైళ్లు.. పర్యవేక్షణ శూన్యం

జిల్లా విద్యాశాఖకు అత్యంత కీలకమైన డీఈవో పోస్టు ఖాళీగా ఉండడంతో విద్యా పరిపాలన పడకేసింది. ఉపాధ్యాయుల బదిలీలు, సర్దుబాట్లు, ఉద్యోగోన్నతులు, టీచ ర్ల పర్యవేక్షణ, అడ్మిషన్ల పెంపు, పాఠశాలల నిర్వహణ నిధులు, విద్యార్థుల సంక్షేమ పథకాలకు సంబంధించిన వందలాది ఫైళ్లు డీఈవో కార్యాలయంలో మూలనపడ్డాయి. క్షేత్రస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ పూర్తిగా లోపించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement