● విచ్ఛలవిడిగా గ్రావెల్ తరలింపు ● అధికార పార్టీ అండతోనే అక్రమ రవాణా
పుత్తూరు: తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్లు మమ్మల్ని అడిగేదెవరు.. ఆపేదెవరు అంటూ కొండలను గుల్ల చేస్తూ గ్రావెల్‌ను విచ్ఛలవిడిగా తరలించేస్తున్నారు. పుత్తూరు మున్సిపల్ పరిధి 12వ వార్డు వినాయకపురం నుంచి కార్వేటినగరం మార్గంలో ఉన్న చలమేశ్వరి స్వామి ఆలయ దారిలో ఉన్న గుట్ట అక్రమ గ్రావెల్‌కు తవ్వకాలకు అడ్డాగా మారింది. ప్రతి రోజూ వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లు మట్టిని లోడు చేసుకుని కార్వేటినగరం మార్గంలో తమిళనాడుకు తరలిస్తున్నాయి. మన ప్రకృతి సంపద ఎడాపెడా తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల గ్రామస్తులు పుత్తూరు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ గుట్టలు పుత్తూరును ఆనుకుని ఉన్న కార్వేటినగరం లెక్కదాఖలాలోకి రావడంతో ఆయన ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గుట్ట పుత్తూరు మున్సిపాలిటీలో, రెవెన్యూ పరిధి కార్వేటినగరం మండలంలో ఉండడంతో అక్రమార్కులకు బాగా కలిసి వస్తోంది. భారీ వాహనాల సాయంతో గుట్టను తవ్వి సరిహద్దులు దాటించేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని రోజుల్లోనే గుట్ట మాయమవడం ఖాయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతోనే ఈ తరలింపు జరుగుతోందని ఆరోపిస్తున్నారు. నెలరోజులుగా అక్రమరవాణా జరుగుతోందని, దీనిపై ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియడం లేదని వినాయకపురం, కుందిమాకుల గుంట, చిన్నబ్బనాయుడు కండ్రిగ, ఉత్తరపు కండ్రిగ గ్రామస్తులు కోరుతున్నారు.
యువకుడిపై కత్తితో దాడి
శ్రీరంగరాజపురం : మండలంలోని పొదలపల్లి గ్రామంలో మంగళవారం యువకుడిపై కత్తితో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పోదలపల్లి గ్రామంలో మంగళవారం గంగజాతర నిర్వహించారు. ఈ జతరలో గంగయ్యకు బాబుకు మధ్య స్వల్ప గొడవ జరిగింది. గంగయ్య కుమారుడు ప్రకాష్ తన తండ్రిని ఎందుకు దూషిస్తున్నావు అని బాబును అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్తత చోటుచేసుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో బాబు, అతని కుమారుడు స్టాలిన్ ఇంట్లో ఉన్న కత్తిని తీసుకువచ్చి ప్రకాష్ కడుపుపై పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ప్రకాష్‌ను స్థానికులు 108 వాహనం ద్వారా చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విష మంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాబు, అతని కుమారుడు స్టాలిన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుమన్ తెలిపారు.
రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యం రూ.15వేల కోట్లు
చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరంగా ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ లక్ష్యం రూ.15వేల కోట్లుగా నిర్ణయించామని ఆ శాఖ ఐజీ అంబేడ్కర్ తెలిపారు. ఆయన బుధవారం చిత్తూరులోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 295 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా తిరుపతి జిల్లా తిరుచానూరులో కొత్త కార్యాలయం ప్రారంభించామన్నారు. మహరాష్ట్ర తరహాలో ఫైలట్ ప్రాజెక్టుగా పీపీపీ విధానంలో మోడల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల విధానం రాష్ట్రంలో అమల్లోకి తెస్తున్నమన్నారు. ఆర్‌ఎస్‌కే (రిజిస్ట్రేషన్ సేవ కేంద్రం)కు కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. జిల్లా కేంద్రంలో కార్యాలయం పెడతామని సబ్‌రిజిస్ట్రార్ మినహాయించి మిగిలినవారు ప్రైవేటు సిబ్బంది అక్కడ ఉంటారన్నారు. అక్కడ డ్యాకుమెంట్ సిద్ధం చేసి చలాన్ చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోనే అవకాశం ఉంటుందన్నారు. డ్యాకుమెంట్ ఫీజు కింద రూ.2వేలు తీసుకొనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్‌ఆర్ నుంచి డీఆర్‌గా 18 మందికి, గ్రేడ్–2 ఎస్‌ఆర్ నుంచి గ్రేడ్–1 ఎస్‌ఆర్‌గా 52 మందికి పదోన్నతులు ఇచ్చామన్నారు. పంచాయతీలకు చెల్లించాల్సిన టీడీలు ఇవ్వనున్నమన్నారు. కార్యక్రమంలో డీఐజీ గిరిబాబు, డీఆర్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


