ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గొచ్చు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గొచ్చు

Jun 25 2026 1:42 AM | Updated on Jun 25 2026 1:42 AM

● తుంపర్లు, బిందు సేద్యంపై రైతులు మొగ్గుచూపాలి ● తక్కువ కాలవ్యవధి పంటలు సాగు చేయాలి ● జిల్లా వ్యవసాయ అధికారి మురళి సూచన

పలమనేరు : ఈదఫా ఎల్‌నినో కారణంగా వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా వర్షాలు తగ్గే అవకాశం ఉందని, రైతులు బిందు, తుంపర్ల సేద్యంపై మక్కువ పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళీ రైతులకు సూచించారు. ఆయన బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా పలమనేరు మండలం టి.వడ్డూరు రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ అభివృద్ధి, సుస్థిర వ్యవసాయం తదితరాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. తక్కువ నీటితో పంటలను పండించాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. ఇందుకోసం ప్రస్తుతం పండిస్తున్న పంటలకు ప్రత్యామ్నాయంగా సోయాబీన్స్‌ పంటను సాగుచేసుకోవాలని సూచించారు. ఇది కూడా వేరుశనగ పంటలాగే తక్కువ నీటితో తక్కువ వ్యవధిలో పంట చేతికి వస్తుందని తెలిపారు. సెరికల్చర్‌ జేడీ పద్మమ్మ మాట్లాడుతూ మల్బరీ సాగులో యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవాలన్నారు. పశుసరంవర్థకశాఖ జేడీ ఉమామహేశ్వరి మాట్లాడుతూ నాణ్యమైన పోషకాహారం అందజేయడం ద్వారా పాడిపశువుల్లో కొవ్వుశాతం పెరుగుతుందన్నారు. అనంతరం అధికారులు స్థానిక నాయకులతో కలిసి రైతులకు సోయాబీన్సు విత్తనాలను పంపిణీ చేసి సాగు విధానాన్ని వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పీఎండీఎస్‌ కిట్ల ద్వారా పేలైజేషన్‌ ఎలా చేయాలో తెలిపారు. ఇందులో జిల్లా ఫిషరీష్‌ విభాగం అధికారులు ప్రకృతి వ్యవసాయశాఖ, స్థానిక వ్యవసాయ అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement