● ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణను ప్రభుత్వమే చేపట్టాలి ● డిపోలు, ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దు ● జిల్లాలో రెండో రోజూ ఎర్ర బ్యాడ్జీలతో నిరసనలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని నాలుగు డిపోల వద్ద రెండు రోజులుగా ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజారవాణా వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని, విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ఏపీఎస్‌ఆర్టీసీకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పేరిట ఆర్టీసీ డిపోలు, విలువైన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని నిలిపివేయాలని మండిపడుతున్నాయి. ఈ మేరకు జి.ఓ. నెం.88ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సీ్త్ర–శక్తి పథకం కోసం 4 వేల కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని కోరాయి. ఉద్యోగులపై దాడులను అరికట్టాలని, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. నాయకులు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు కొత్త డీఏలు, ఐఆర్ ప్రకటించాలని కోరారు. 12వ పీఆర్సీ కమిషనన్‌ను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం అమలులో ఉన్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌కు బదులు పాత విధానాన్ని కొనసాగించాలని సూచించారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. చిత్తూరు టూ డిపో గేటు ఎదుట నిర్వహించిన నిరసనలో నాయకులు వినోద్‌కుమార్, సీవీ మురళీధర్, సతీష్, అన్బు, జేఎం బాలాజీ పాల్గొన్నారు.
ఎంఈవోపై దాడి
శ్రీరంగరాజపురం : మండల విద్యాధికారి అరుణాచలంరెడ్డి, అతని కుటుంబ సభ్యులను అడ్డగించి దాడిచేసిన సంఘటన మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట గ్రామం వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఏంఈవో అరుణాచలంరెడ్డి కుటుంబంతో కలిసి స్వగ్రామం 49 కొత్తపల్లి నుంచి చిత్తూరుకు వస్తుండగా మార్గమధ్యంలో 49 కొత్తపల్లిమిట్ట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అకారణంగా వారిని అడ్డగించి దాడి చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


