చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పది, ఇంటర్ అడ్మిషన్లకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన బుధవా రం డీఈవో కార్యాలయంలో ఓపెన్ స్కూల్ 2026–27 విద్యాసంవత్సరం అడ్మిషన్ల పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. డీఈవో మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల మధ్యలో చదువు మానేసిన వారు ఓపెన్ స్కూల్‌లో పది, ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువులు చదివేందుకు అర్హులన్నారు. అభ్యర్థులకు సమీపంలో స్టడీ సెంటర్లలో అడ్మిషన్ పొందవచ్చన్నారు. జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్, ఏపీ ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ సర్టిఫికెట్లు ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత చదువులకు చెల్లుబాటు అవుతాయన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు జూలై 30, అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు జూలై 31వ తేదీ చివరి తేదీ అని తెలిపారు. పదవ తరగతికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100 (అందరికీ), అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరీ పురుషులకు రూ.1300, సీ్త్రలకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు) రూ.900, పాఠ్యపుస్తకాలు, సర్టిఫికెట్లు ఇంటి చిరునామాకు పంపేందుకు పోస్టల్ చార్జీలు రూ.200 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇంటర్ అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 (అందరికీ), ఫీజు జనరల్ పురుషులకు రూ.1400, సీ్త్రలు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులకు) రూ.1100, పాఠ్యపుస్తకాలు, సర్టిఫికెట్లు ఇంటి చిరునామాకు పంపేందుకు పోస్టల్ చార్జీలు రూ.200 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రెటరీ హేమాద్రి, జీడీనెల్లూరు జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం సుబ్బరామయ్య, సీనియర్ అసిస్టెంట్ సల్లార్ ఖాన్, సిబ్బంది లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


