నియంత్రణలో అధికారుల వైఫల్యం కుప్పం కేంద్రంగా బియ్యం తరలింపు తమిళనాడుకు యథేచ్ఛగా గ్రానైట్ సరఫరా చెక్ పోస్టులు మూతపడడంతో యథేచ్ఛగా వ్యాపారం
కుప్పం మూడు రాష్ట్రాల కూడలి ప్రాంతం. ఇది అక్రమ రవానాకు కేంద్రంగా మారింది. గతంలో సరిహద్దుల్లో అక్రమ రవాణా నియంత్రణ కోసం చెక్ పోస్టులు ఉండేవి. వాటిని ప్రస్తుతం మూసివేయడంతో అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కొంతమంది తమిళనాడు రాష్ట్రం నుంచి బియ్యం కర్ణాటకలోని బంగారుపేటకు, అలాగే కుప్పం నుంచి గ్రానైట్‌ను తమిళనాడుకు తరలిస్తున్నారు. అలాగే ఉప్పు నుంచి పప్పు వరకు నిత్యావసర సరుకులను కర్ణాటక నుంచి కుప్పానికి అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనికి అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తమిళనాడు బియ్యం పట్టుకున్న పోలీసులు (ఫైల్)
మూతపడిన బిసానత్తం చెక్ పోస్టు
కుప్పం: తమిళనాడు ప్రభుత్వం రేషన్ కార్డులకు ఇచ్చే బియ్యాన్ని వ్యాపారులు కిలో రూ.15లకు కొనుగోలు చేస్తున్నారు. తర్వాత వాటిని కర్ణాటకలోని బంగారుపేటలో ఉన్న రైస్ మిల్లులకు కేజీ రూ.30 నుంచి రూ.40లకు విక్రయిస్తున్నారు. రైస్ మిల్లుల యాజమాన్యం వాటిని పాలీష్ పట్టి అధిక ధరలు అమ్ముతున్నారు. అక్రమార్కులకు కూటమి నాయకులు అండదండలు మెండుగా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక కూటమి నాయకుల టిప్పర్లు, కంటైనర్ల ద్వారానే బియ్యం రవాణా చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. కుప్పం మండలంలోని ఇద్దరు మల్లానూరు చెందిన నాయకులు, శాంతిపురం మండలంలో ఇద్దరు, రామకుప్పంలో ఇద్దరు ముఠాగా ఏర్పడి బియ్యం స్మగ్లింగ్‌ను దర్జాగా సాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. తమిళనాడు సరిహద్దులోని రామకుప్పం మండలం ఆరిమాను పెంట, శాంతిపురం మండలం విజలాపురం, కుప్పం మండలం మల్లానూను, అడవిబూదుగూరు గ్రామాల మీదుగా కర్ణాటకకు బియ్యం తరలిస్తున్నట్టు పేర్కొంటున్నారు. నిత్యం అర్ధరాత్రి వేళల్లో టిప్పర్లు, లారీల్లో బియ్యం తరలిపోతోందని చెబుతున్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని ఓ గ్రామంలో బియ్యం గోడౌన్ ఏర్పాటు చేసుకుని శాంతిపురానికి చెందిన నాయకులు దర్జాగా బియ్యం రవాణా సాగిస్తున్నారు.
తమిళనాడు గ్రానైట్ తరలింపు
కుప్పం ప్రాంతంలో గ్రానైట్ ఎక్కువగా లభిస్తుంది. ఇక్కడి క్వారీల్లో రాతి దిమ్మెలను గుట్టుచప్పుడు కాకుండా తమిళనాడు రాష్ట్రంలోని బరుగూరు, జగదేవి, హోసూర్, చైన్నె నగరాలకు తరిలిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ విష యం తెలిసినా అధికారులు కూటమి నేతలకు భయపడి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పుట్టగొడుగుల్లా క్వారీలు
కుప్పం నియోజకవర్గంలో రెండేళ్లుగా అక్రమ క్వారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అధికార పార్టీ నేతలు నిర్ణయించిన రేటు చెల్లిస్తే ఎన్ని హెక్టార్లలోనైనా తవ్వకాలు చేసుకోవచ్చు. వారు ఆ జాబితాను సంబందిత శాఖ అధికారులు, పోలీసులకు పంపిస్తారు.దీంతో అధికారుల నుంచి క్వారీ పనులకు ఆంటంకాలు ఉండవు. దీంతో పాటు రాతి బ్లాక్ రవాణాకు సైతం అనుమతులు అందినట్లే.
కర్ణాటక నుంచి నిత్యావసర సరుకుల దిగుబడి
కుప్పానికి కర్ణాటకలోని బంగారుపేట 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి కుప్పానికి ప్రతి రోజూ అక్రమంగా నిత్యావసర సరుకులను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ సరుకులను పట్టణంలోని వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచి విక్రయిస్తూ ప్రజల నడ్డివిరుస్తున్నారు.
మూతపడిన చెక్ పోస్టులు
అక్రమ రవాణాను అరికట్టేందుకు గతంలో సరిహద్దు ప్రాంతంలో చెక్ పోస్టులు ఉండేవి. తమిళనాడు సరిహద్దులోని గాంధీనగర్, వేపనపల్లి, ఆరిమానుపెంట, మెట్లచేను, నడుమూరు, కర్ణాటక సరిహద్దులోని బిసానత్తం, కెంపాపురం, సాతు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఉండేవి. సిబ్బంది నిరంతరం కాపలా కాస్తూ అక్రమ రవాణాను అరికట్టేవారు. ప్రస్తుతం ఆ చెక్ పోస్టులు మూతపడడంతో అక్రమ రవాణా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.


