● 12వ పీఆర్‌సీ, పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్స్ చెల్లింపులపై చర్చ
● కలెక్టరేట్‌లో ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం
● ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వి.శివయ్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి దాదాపు రూ.35 వేల కోట్ల ఆర్థిక బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తమ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ప్రతిపాదించిన ‘రండి.. టీ తాగుతూ మాట్లాడుకుందాం‘ కార్యక్రమం ప్రకారం.. ప్రభుత్వం ఈ బకాయిలను నగదు రూపంలో చెల్లించలేకపోతే, వాటికి బదులుగా ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కారుణ్య నియామకాలను త్వరగా చేపట్టాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ బలోపేతం చేయాలని కోరారు.
● ఏపీ ఉపాధ్యాయ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) జిల్లా అధ్యక్షులు కే. చలపతిరావు డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు. కొత్త పీఆర్సీ కమిషన్ వేసి, తక్షణమే 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇన్–సర్వీస్ టీచర్లకు టెట్ నిబంధనను రద్దు చేయాలని, విద్యార్థులకు రవాణా భత్యం, పాఠశాల స్థాయిలోనే యూనిఫాం, షూస్ అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. గిరిబాబు, రాష్ట్ర నాయకులు చిట్టిబాబులు పాల్గొన్నారు.
● పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కె.ఎస్. కన్నన్, ప్రధాన కార్యదర్శి ఎ. విజయ భాస్కర రెడ్డి 19 డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. మధ్యాహ్న భోజన సరుకులను సకాలంలో సరఫరా చేయాలని కోరారు. కాంట్రాక్టర్ల వైఫల్యాలకు హెడ్‌మాస్టర్లను బాధ్యులను చేయరాదని డిమాండ్ చేశారు.
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. డీఆర్‌వో మోహన్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన అన్ని రకాల వసతులు, సౌకర్యాల కల్పనకు జిల్లా యంత్రాంగం తరపున చర్యలు చేపడుతామన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 12వ పీఆర్‌సీ, పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్స్ చెల్లింపులు పై చర్చించారు. ఉద్యోగుల వెల్ఫేర్ ఫండ్, మహిళా ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని సంఘ నాయకులు కోరారు. సమావేశంలో ఆపస్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్‌గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, ఏపీ ఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షులు రాఘవులు, కార్యదర్శి రమేష్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షులు మదన్‌మోహన్‌రెడ్డి పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల గళం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిపోయిన జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సుమారు 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలెక్టరేట్‌లో నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లాలోని 19 గుర్తింపు పొందిన సభ్య సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు హాజరై ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలపై గళమెత్తారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ కౌన్సిల్ పునరుద్ధరించినందుకు కలెక్టర్‌కు సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.