మామిడి రైతులకు ఆత్మహత్యలే శరణ్యమా?
తిరుపతి మంగళం : చంద్రబాబు పాలనలో మామిడి రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతీపురంలోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయమే దండగ, విద్యుత్ వైర్లపై బట్టలు ఆరేసుకోండి అంటూ రైతులను హేళన చేసిన ఘనుడు చంద్రబాబు అని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా మామిడి పంటకు పెట్టింది పేరన్నారు. అలాంటి జిల్లాలో మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.
కిలోకు రూ.15 ఇవ్వాల్సిందే
కిలోకి రూ.15 ఇస్తే కానీ గిట్టుబాటు కాదని మామిడి రైతులు చెబుతుంటే చంద్రబాబు ప్రభుత్వం రూ.4 ప్రకటించి చేతులు దులిపేసుకుందని భూమన మండిపడ్డారు. జిల్లాలో 25 ఫల్ప్ ఫ్యాక్టరీలు కిలో రూ.5కు కూడా కొనుగోలు చేయడం లేదన్నారు. రోజుల కొద్దీ ఫల్ప్ ఫ్యాక్టరీల వద్ద లారీలు, ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయన్నారు. చిత్తూరు జిల్లాలో ఏడు లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తే అందులో గిట్టుబాటు ధర లేక రెండు లక్షల టన్నుల కాయలను రైతులు చెట్లల్లోనే వదిలేశారన్నారు.
ఆత్మహత్యాయత్నం బాధాకరం
గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలో టీడీపీ సానుభూతిపరుడైన మామిడి రైతు గిట్టుబాటు ధర లేక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమని భూమన వాపోయారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే రైతు రాజుగా బతికాడని గుర్తుచేశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే ఆ పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే చిత్తూరు జిల్లాలో మామిడి రైతులంతా తోపులను నరికేసి మామిడి కట్టెలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుంటే ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు.


