దాము కుటుంబం సభ్యులు(ఫైల్)
తనలా కాకూడదని..
తాను చిన్నప్పుడు అనుభవించిన తల్లిలేని బాధను తన బిడ్డలు అనుభవించాల్సి వస్తుందన్న భయం, ఆలోచనలే దామును తీవ్ర మనోవేదనలోకి నెట్టాయి. బయటకు కనిపించని ఆ మౌన యుద్ధంలో అత్యంత విషాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ముందుగా భార్య నిర్మల (28), కుమారుడు దిలీప్ (14), కుమార్తె శ్రీవిద్య (12)కు విషమిచ్చాడు. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకే కనిపించే దాము ఆ రోజు ఇంటి వద్దకు వెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన అక్క చిన్ని ఇంటి వద్దకు వెళ్లింది. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో గ్రామస్తులను పిలిచి తలుపులు పగులగొట్టి చూడగా నలుగురు విగతజీవులుగా పడి ఉన్నారు.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పలమనేరు మండలం మండీపేటకోటూరుకు చెందిన మునెప్పకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మకు మార్కొండ, పండు, చిన్ని, దాము సంతానం. రెండో భార్య సుబ్బమ్మ. దాము వయసు నాలుగేళ్లు కూడా నిండకముందే తల్లి లక్ష్మమ్మ అనారోగ్యంతో కన్నుమూసింది. పెరుగుతున్న కొద్దీ తల్లి లేని లోటు దామును తీవ్రంగా వేధించింది.
అక్క చెంత కొత్త జీవితం
అక్క చిన్ని వివాహం చేసుకుని చిత్తూరు మండలం బంగారెడ్డిపల్లికి వచ్చింది. దాము కూడా జీడీనెల్లూరు మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన నిర్మలను పెళ్లి చేసుకున్నాడు. వారికి దిలీప్, శ్రీవిద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. బంగారెడ్డిపల్లెలో స్థిరపడ్డాడు. డబ్బు కూడబెట్టి స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నాడు. వారి జీవితం సంతోషంగా సాగుతోంది. ఇంతలోనే విధి వక్రించింది.
భార్యకు పక్షవాతం
పదేళ్ల క్రితం నిర్మలకు పక్షవాతం వచ్చింది. మొదట చికిత్సతో కొంత కోలుకున్నా, తర్వాత ఆరోగ్యం క్షీణించింది. అప్పటి నుంచి దాము జీవితం ఆస్పత్రుల చుట్టూ తిరిగే ప్రయాణంగా మారింది. చిత్తూరు, వేలూరు, రాణిపేట, చైన్నెలోని ఆస్పత్రులకు భార్యను తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో అప్పులు చేశాడు. రాణిపేటలోని ఓ ఆస్పత్రిలో వైద్యులు శస్త్రచికిత్సకు రూ.3 లక్షలు అవసరమని చెప్పారు. ముందుగా రూ.50 వేల వరకు చెల్లించాడు. మిగిలిన డబ్బు సమకూర్చుకుని వస్తానని చెప్పి ఇంటికి చేరాడు. ఆ తర్వాత తిరుపతిలోని మరో ఆస్పత్రిలో చూపించాడు. అక్కడి వైద్యులు చిన్న మెదడుకు శస్త్రచికిత్స చేస్తే ప్రాణాపాయం తప్పదని స్పష్టం చేశారు. ఇక చేసేదేమీ లేదని చేతులెత్తేశారు. ఆ మాటలు దాము ఆశలపై చివరి దెబ్బగా మారాయి.
కుమార్తెతో పాటు దాము మృతదేహం, నిర్మల మృతదేహం , విగతజీవిగా పడివున్న దిలీప్
గ్రామాన్నే కంటతడి పెట్టించింది
సంఘటన స్థలంలో టీవీపై ఉంచిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ అంత్యక్రియలను ప్రభుత్వ ఖర్చుతో కాకుండా, తన సొంత నిధులతో నిర్వహించాలని అందులో రాసి ఉంది. ఆ లేఖ చదివిన వారందరూ ఒక్కసారిగా మౌనంగా మారిపోయారు. చివరి క్షణాల్లో కూడా తన కుటుంబ గౌరవం గురించి ఆలోచించిన దాము పరిస్థితి ఎంత దయనీయంగా ఉండి ఉంటుందోనని చర్చించుకున్నారు. తల్లి లేని చిన్ననాటి బాధను జీవితాంతం మోసిన దాము భార్య అనారోగ్యాన్ని తట్టుకోలేక, పిల్లల భవిష్యత్తుపై భయంతో చివరకు తీసుకున్న నిర్ణయం నలుగురు ప్రాణాలను బలిగొంది. ఇప్పుడు ఆ ఇంటి ముందు మిగిలింది నాలుగు చితులు... గ్రామం గుండెల్లో మిగిలింది చెరగని విషాదం మాత్రమే.
అతను చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. అనాథలా పెరిగాడు. పెళ్లి చేసుకుని జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలకు ఏ లోటూ రాకుండూ చూసుకుంటున్నాడు. విధి అతడిని వదల్లేదు. భార్య అనారోగ్యం పాలవడం.. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో కుమిలిపోయాడు. ఖరీదైన వైద్యం చేయించడానికి చేతిలో చిల్లిగవ్వ లేక మనోవ్యథ చెందాడు. ఇంక బతకడం వృథా అనుకున్నాడు. తాను చిన్నప్పుడు పడిన తల్లిలేని బిడ్డ అనే ఆవేదన తన పిల్లలకు రాకూడదని భావించాడు. పిల్లలు, భార్యకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు మండలం బంగారెడ్డిపల్లిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
చిన్ననాటి గాయం.. నలుగురిని మింగేసింది..!
నా తమ్ముడు చివరగా ఏమన్నాడంటే..
‘‘మనం తల్లి లేని బిడ్డలం కదా. మనం పడిన కష్టాలు తెలుసు కదా. నా బిడ్డలు కూడా తల్లిలేని బిడ్డలైపోతున్నారు’’ అని నా తమ్ముడు బాధపడేవాడు. తల్లి అయినా.. అత్త అయినా నేను ఉంటానని చెప్పాను. చేతిలో చేయి వేసి నేనుండానని చెప్పాను. ఆదివారం రాత్రి కూడా సంగటి, చికెన్ వండిపెడితే భార్యాభర్తలు తిన్నారు. నేను ఇక్కడే పడుకుంటాను అంటే వద్దన్నాడు. ఇంటికెళ్లు మామ ఒక్కడే ఉంటాడు అని చెప్పి నన్ను పంపించాడు. తెల్లారేకల్లా నా తమ్ముడు ఇలా విగతజీవిగా మారాడు. భార్య బతకాలని మొక్కని దేవుళ్లు లేరు.
– చిన్ని, దాము సోదరి


