చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు ఆదేశించారు. ఆయన సోమ వారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి ప్రజలు వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో లోఓల్టేజీ, వ్యవసాయ సర్వీసుల మంజూరు, ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరాలో అంతరాయాలు తదితర సమస్యలు ఉన్నారు. అనంతరం ఎస్‌ఈ అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వినియోగదారులకు ఇబ్బందులకు గురిచేయరాదని ఆదేశించారు.
డీసెట్ హాల్ టికెట్లు
డౌన్‌లోడ్ చేసుకోండి
కార్వేటినగరం: 2026–27లో డీఈడీ కోర్సు చేసేందుకు ఏపీ డీసెట్–2026కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను టౌన్‌లోడ్ చేసుకోవాలని డైట్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ దామోదర రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూలై 1న ప్రవేశ పరీక్ష జరగనుందని తెలిపారు. హాల్‌టికెట్లను వెబ్‌సైట్ apdeecet.apcfss.in సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈమేరకు డీసెట్ చైర్మన్, డైరెక్టర్ పాఠశాల విద్య అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడినట్లు పేర్కొన్నారు.
బాలికపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
చిత్తూరు అర్బన్: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో వగళ్ల మోహన్ రెడ్డి (37) అనే ముద్దాయికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని పోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహ న కుమారి ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ.. సదుం మండలం గుట్టమీదపల్లె బస్టాప్ వద్ద 2014 మే 24వ తేదీన 17 ఏళ్ల బాలిక బస్సు కోసం వేచి ఉంది. ఆ సమయంలో గుట్టమీదపల్లె గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మోహన్‌రెడ్డి తన ఆటోలో ఆమెను ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లాక, ఆటోను పక్కకు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అదేరోజు బాలికను హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. బాలికను వదిలేయాలని మోహన్‌రెడ్డి స్నేహితుడు చెప్పగా, అక్కడే వదిలేశాడు. ఆపై బాలిక తన స్వగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. దీనిపై బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో సదుం పోలీసులు కేసు నమోదుచేసి, నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. న్యాయస్థానంలో సాక్ష్యాధారాలతో సహా నేరం రుజువుకావడంతో ముద్దాయికి పదేళ్ల జైలుశిక్ష, రూ.16 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ఇన్‌చార్జ్ న్యాయమూర్తిగా ఉన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ప్రభుత్వం తరఫున అందజేయాలని జిల్లా కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది.
టిప్పర్‌ను ఢీకొన్న కారు
– ఒకరి మృతి
– మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
గుడిపాల: మండలంలోని వసంతాపురం వద్ద సోమవారం టిప్పర్‌ను కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ రామ్మోహన్ కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం వందవాసికి చెందిన నారాయణస్వామి(60), దివ్య(16), బాలసుబ్రమణ్యం(50), విజయలక్ష్మి, చారులత, కావ్య, విజయలక్ష్మి కారులో శ్రీకాళహస్తి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వసంతాపురం వద్ద ముందు వెళుతున్న టిప్పర్‌ను కారు ఢీకొంది. దీంతో నారాయణస్వామి, దివ్య, బాలసుబ్రమణ్యం(50) తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలసుబ్రమణ్యం మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. విజయలక్ష్మి, చారులత, కావ్యకు స్వల్పగాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


