కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా రూ.10,700 కోట్ల బకాయిలు ధర్నాలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీన్ ధ్వజం
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.10,700 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీన్‌కుమార్ డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సోమవారం గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ చదువుతున్న 11 లక్షల మంది విద్యార్థులకు దాదాపు రూ.10,700 కోట్ల బకాయిలను ఉన్నాయని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజులు విడుదల చేస్తామని ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. గత రెండేళ్లుగా రూ.2,200 కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకుండా తొక్కిపెట్టిందన్నారు. ప్రతి ఏటా ఫీజుల పథకానికి రూ.3,900 కోట్లు కేటాయించాల్సి ఉండగా, 2026–27 బడ్జెట్‌లో రూ.2,766 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌లో రూ.1200 కోట్లు చూపి, రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. గతంలో వసతి దీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌కు రూ.15 వేలు, ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ విద్యార్థులకు రూ.20 వేలు అందేవన్నారు. ప్రస్తుత కూటమి సర్కారు నిధుల కోతతో 11 లక్షల మంది విద్యార్థులను పథకాలకు దూరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే బకాయిలతో సంబంధం లేకుండా కాలేజీల నుండి విద్యార్థుల సర్టిఫికెట్లు తక్షణమే ఇప్పించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ధర్నాలో నాయకులు లిఖిత్, వివేక్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.


