ఆ సీఐ వెనుక బిగ్‌బాస్‌ ఎవరు? | - | Sakshi
Sakshi News home page

ఆ సీఐ వెనుక బిగ్‌బాస్‌ ఎవరు?

Jun 23 2026 1:16 AM | Updated on Jun 23 2026 1:16 AM

సాయికృష్ణ లాకప్‌ డెత్‌పై సీబీఐ విచారణ జరగాలి కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): సాయికృష్ణ లాకప్‌ డెత్‌పై సీబీఐ విచారణ జరిపించాలని, ఆ సీఐ వెనుక ఉన్న బిగ్‌బాస్‌ ఎవరో బయటపెట్టాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్‌ చేశారు. ఆయన సోమవారం చిత్తూరు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ మృతి, దళిత యువకుడు క్రాంతికుమార్‌ ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయికృష్ణ మరణం వెనుక ఉన్న అసలు బాధ్యులను ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. కేసులో మర్డర్‌ సెక్షన్లు నమోదు చేసినప్పటికీ సంబంధిత సీఐపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ‘ఆ సీఐ వెనుక ఉన్న బిగ్‌బాస్‌ ఎవరు అంటూ ప్రశ్నించారు. ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. తమిళనాడులో జరిగిన తూత్తుకుడి లాకప్‌ డెత్‌ కేసులో సాక్ష్యాలు ఆధారంగా తొమ్మిది మంది పోలీసులకు కఠిన శిక్షలు పడిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ రాష్ట్రంలో చట్టం తన పని చేసిందని, మన రాష్ట్రంలో మాత్రం నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దళిత కుటుంబానికి చెందిన యువకుడు క్రాంతికుమార్‌ సీఐ నాగరాజు వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ ఘటనపైనా ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాలలు, మాదిగలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నప్పటికీ దళితులపై దాడులు ఆగకపోవడం బాధాకరమన్నారు. గతంలో మాల, మాదిగలు ఐక్యంగా ఉన్నారని, అనంతరం రాజకీయ ప్రయోజనాల కోసం వారిని విడదీసి దళితుల ఐక్యతను బలహీనపరిచారని దుయ్యబట్టారు. దళితులపై అన్యాయం జరుగుతున్నా కొందరు నాయకులు, సంఘాల ప్రతినిధులు మౌనం పాటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయికృష్ణ, క్రాంతికుమార్‌ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో నాయకులు లోకేష్‌రెడ్డి, ఇరుగమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement