చిత్తూరు కలెక్టరేట్: చేనేత కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగ దని రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యా చరణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షణ్ముగవర్మ మండిపడ్డారు. చేనేత కార్మికులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు పెండింగ్‌లో ఉన్న రూ.203 కోట్ల బకాయిలు ఇవ్వాలన్నారు. గత ఏడాది ఆగస్టు 7న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధంగా నేతన్న భరోసా కింద రూ.25 వేలు విడుదల చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.25 వేల కోట్లను కేటాయించాలన్నారు. చేనేతలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల తరహాలోనే చేనేత కార్మికులకు రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. చేనేత అనుబంధ ఉపవృత్తి కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు కె.వి.కుప్పయ్యశెట్టి, గౌరవాధ్యక్షుడు నీలా పండరి, జిల్లా చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు చల్లా బాలాజీ, నాయకులు చల్లా మురగయ్యశెట్టి, చల్లా లోకనాథంశెట్టి, కందల బాలాజీ, నీల శంకర్, కోటేశ్వరి పాల్గొన్నారు.
ప్రశాంతంగా ముగిసిన కౌన్సెలింగ్
– 490 మంది టీచర్ల బదిలీలు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. చిత్తూరు ఇన్‌చార్జ్ డీఈవో వెంకటేశ్వరరావు, తిరుపతి డీఈవో కేవీఎన్ కుమార్ సంయుక్తంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కౌన్సెలింగ్‌ను పకడ్బందీగా చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 490 మంది ఎంటీఎస్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ కోసం విద్యాశాఖ అధికారులు 868 ఖాళీలను ప్రదర్శించారు. ఈ బదిలీల్లో పాల్గొన్న వారిలో 1998 డీఎస్సీ టీచర్లు 316 మంది ఉండగా, 2008 డీఎస్సీకి చెందిన వారు 174 మంది ఉన్నారు. సీనియారిటీ, నిబంధనల ప్రకారం పారదర్శకంగా స్థానాలను కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ పర్యవేక్షణలో చిత్తూరు, తిరుపతి జిల్లాల విద్యాశాఖ సూపరింటెండెంట్లు రమేష్, నాగరాజు, గుడిపాల ఎంఈవో హస్సన్‌బాషా, ఏఎస్వో ఆనంద్, ఏపీవో జయప్రకాష్, ఉపాధ్యాయ సంఘం నేతలు గంటా మోహన్, కన్నన్, విజయ భాస్కర్, ప్రకాష్, మదన్ మోహన్, రమణ తదితరులు పాల్గొన్నారు.


