ఒక్కో పంటకు ఒక్కో కోత..
చెరుకు సాగు నుంచి మామిడి ధరల
వరకు వరుస దెబ్బలు
వేరుశనగ విత్తనాలు లేక ఖరీఫ్
గందరగోళం
వరి వేయొద్దన్న వ్యాఖ్యలతో రైతుల్లో
ఆందోళన
ప్రత్యామ్నాయ పంటల పేరుతో చెడుగుడు
జిల్లాలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. కష్టాన్నే నమ్ముకుని .. చెమటను అమ్ముకుంటున్న రైతు పరిస్థితి గందరగోళంగా మారింది. చెరుకు పంటకు ఊపిరిగా నిలిచిన చక్కెర ఫ్యాక్టరీ మూతపడింది. మామిడికి గిట్టుబాటు ధర లేదు. ఖరీఫ్ ప్రారంభమైనా ఇప్పటి వరకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయలేదు. తాజాగా ప్రభుత్వం వరి సాగుపై చేస్తున్న వ్యాఖ్యలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ ప్రభుత్వం వ్యవసాయంలో పెడుతున్న కోతలతోపాటు ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయినా పరిహారం అందకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
కాణిపాకం: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 20 ఏళ్ల క్రితం చెరుకు సాగు 28 వేల హెక్టార్లకు పైగా ఉండేది. సుమారు 30 వేల మంది రైతులు చక్కెర ఫ్యాక్టరీపై ఆధారపడి జీవించేవారు. చంద్రబాబు హయాంలో చిత్తూరు, గాజులమండ్యం చెరుకు ఫ్యాక్టరీల మూసివేతతో ఆ రైతు కుటుంబాలు వీధిన పడ్డాయి. కొంతమంది రైతులు బెల్లం తయారీ వైపు మొగ్గుచూపారు. బెల్లం తయారీపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో చెరుకు సాగు క్షీణించింది. ప్రస్తుతం సాధారణ సాగు విస్తీర్ణం 6 వేల హెక్టార్లు కాగా 2,500 హెక్టార్లకే పరిమితమైంది. ఎక్కువ మంది రైతులు మామిడి వైపు అడుగులు వేశారు.
వేరుశనగ పంటకూ కోత
జిల్లాలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌లో సుమారు 40 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరం. ఈ సారి 27 వేల క్వింటాళ్లు మాత్రమే కేటాయించారు. వాటిలోనూ ఇప్పటి వరకు 3 వేల క్వింటాళ్లు మాత్రమే రైతుల చేతికి చేరాయి. సాధారణంగా మే చివరి వారంలోనే విత్తనాలు పంపిణీ చేయా ల్సి ఉండగా జూన్ చివరికి కూడా పూర్తిస్థాయిలో అందకపోవడంతో రైతులు ప్రైవేటు మార్కెట్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే సమయంలో వర్షాలను సాకుగా చూపుతూ వేరుశనగకు బదులు సోయా బీన్స్ సాగు చేయాలని అధికారులు సూచించడం రైతులను మరింత అయోమయానికి గురిచేస్తోంది.
వరి వద్దంటున్నారు
పంటలకు మార్కెట్ కల్పించడంతోపాటు గిట్టుబాటు ధరలు ప్రకటించాల్సిన ప్రభుత్వం ఆ పంటే వేయొద్దని చెబుతోంది. వరి సాగు లాభదాయకం కాదని, బియ్యానికి డిమాండ్ ఉండదని, ప్రత్యామ్నాయంగా పామాయిల్, కోకో వంటి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సూచించారు. దీంతో ఏ పంట సాగు చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఖరీఫ్‌లో జిల్లాలో 10 వేల హెక్టార్లు, రబీలో 30 వేల హెక్టార్లకు పైగా వరి సాగవుతుండగా, మంత్రి చేసిన వ్యాఖ్యలు రైతుల్లో తీవ్ర నిరాశను నింపాయని రైతు సంఘాలు అంటున్నాయి. ‘వరి వేయొద్దు... ఎవరు కొనరు‘ అనే సంకేతం రైతు భవిష్యత్తుపై ప్రభుత్వం చేతులెత్తేసినట్టేనని నాయకులు విమర్శిస్తున్నారు.
పరిహారం మాటల్లోనే...
2024లో కరువు కారణంగా జిల్లాలో సుమారు 9 వేల హెక్టార్లలో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింది. అధికారులు రూ.15 కోట్ల నష్టాన్ని అంచనా వేసి ప్రతిపాదనలు పంపారు. కేంద్ర బృందం కూడా పర్యటించింది. నేటికీ రైతులకు పరిహారం అందలేదు. 2025లో వరుస తుపాన్లతో వరి, టమాటా, ఉద్యాన పంటలు భారీగా నష్టపోయాయి. రూ.1.20 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రభుత్వ యంత్రాంగమే నివేదికలు సమర్పించినా పరిహారం రైతుల ఖాతాల్లో జమ కాలేదు.
ప్రభుత్వం నిర్లక్ష్యం
జిల్లాలో ప్రధాన పంటలన్నింటిపైనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిందిపోయి ప్రత్యామ్నాయ పంటల పేరుతో బాధ్యతలను రైతుపైనే నెట్టేస్తోందని మండిపడుతున్నాయి. అన్నం పెట్టే రైతు భరోసా కోల్పోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతుందని హెచ్చరిస్తున్నాయి.
రైతు ఆశలపై కూటమి కత్తి
మామిడిపైనా దెబ్బ
జిల్లలో 59 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగయ్యాయి. తోతాపురి రకంపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఏడాదికేడాది కాయల ధరలు పతనమవుతుండడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. సాధారణంగా తోతా పురి రకం కేజీ మామిడి పండించేందుకు రైతుకు రూ.14 వరకు ఖర్చవుతోంది. మార్కెట్‌లో రూ.3 నుంచి రూ.6 మాత్రమే ధర లభిస్తోంది. కనీస మద్దతు ధర ప్రకటించాల్సిన ప్రభుత్వం కేజీకి రూ.4 ప్రోత్సా హకం ప్రకటించి చేతులు దులుపుకుంటోంది. ఈ కారణంగా మామిడి తోటల తొలగింపుకు రైతులు సిద్ధమవుతున్నారు.
చిల్లిగవ్వ కూడా సాయం లేదు
నాకు 4 ఎకరాల పొలం ఉంది. రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. రెండేళ్లుగా వరుస తుపాన్లతో పంట మొత్తం నేలమట్టమైంది. నష్టం అంచనా వేసి ఏళ్లు గడుస్తోంది. ఇంత వరకు ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా సాయం చేయలేదు. మరో రెండు ఎకరాల దాకా మామిడి ఉంది. పంటను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నాం. వ్యవసాయంలో జరిగే నష్టాలను చెబితే ప్రభుత్వం ఆ పంటలు వద్దు..ఈ పంటలు వద్దు అని చెబుతోంది. – మదివానన్, ఆముదాల, పాలసముద్రం మండలం


