● ఫ్యాక్టరీ వద్ద కిలోమీటర్ల మేర నిలిచి పోయిన వాహనాలు ● అన్‌లోడ్ చేయడానికి రోజుల తరబడి నిరీక్షణ ● గిట్టుబాటు ధర రూ.15 ఇవ్వాలి ● మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
గంగాధర నెల్లూరు: ఫ్యాక్టరీ నిర్వాహకులు సకాలంలో మామిడి కాయలను అన్‌లోడ్ చేయకపోవడంతో ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్నాయని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. మామిడి కాయలను తీసుకువచ్చిన ట్రాక్టర్లు కిలోమీటర్ల మేర నిలిచిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆయన ఆదివారం జీడీ నెల్లూరు మండలంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతూ మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద వందలాదిగా వేచి ఉన్న మామిడి ట్రాక్టర్లను చూసి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ మోతరంగనపల్లి మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద దాదాపు 350 ట్రాక్టర్లు, అబ్బాస్ నగర్ కాలనీ వద్దగల పరిశ్రమ వద్ద దాదాపు 400 ట్రాక్టర్లు అన్‌లోడింగ్ కోసం వేచి ఉన్నాయ ని తెలిపారు. సీరియల్ నంబర్ కోసం రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. నంబర్ పొందాక అన్‌లోడింగ్ చేయడానికి లోడుకు వారం రోజులు పడుతోందని తెలిపారు. ఈ లోపు కాయలు సగానికి సగం కుళ్లిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల బాధను గుర్తించి రూ.15ల గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.


