సంక్షోభంలో చేనేత పరిశ్రమ | - | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో చేనేత పరిశ్రమ

Jun 22 2026 12:18 AM | Updated on Jun 22 2026 12:18 AM

● కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ రూ.50.65 లక్షల కోట్లలో చేనేత రంగానికి రూ.25 వేల కోట్లు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ రూ.3.20 లక్షల కోట్లలో చేనేత రంగానికి కనీసం రూ.2 వేల కోట్లు కేటాయించి సకాలంలో నిధులు విడుదల చేయాలి. ● సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. సహకార సంఘాల రుణాలను రద్దు చేయాలి. ● ఎన్నికల వాగ్దానం మేరకు ప్రతి ఏటా రూ.25 వేలను నేతన్నలు, ఉపవృత్తుల వారికి వెంటనే చెల్లించాలి. ● చేనేతలకు ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను చేనేత ఉపవృత్తుల వారికి కూడా వర్తింపజేయాలి. ● చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించాలి. ● కేంద్ర ప్రభుత్వ 1995 హ్యాండ్లూమ్‌ రిజర్వేషన్‌ చట్టం ప్రకారం చేనేతలకు 11 రకాల రిజర్వేషన్లను కఠినతరం చేసి పకడ్బందీగా అమలు చేయాలి. ● కేంద్ర ప్రభుత్వ చట్టం హ్యాంకార్న్‌ నోటిఫికేషన్‌ను ప్రతి నూలు మిల్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. హ్యాండ్లూమ్‌ బోర్డును పునరుద్ధరించాలి. ● చేనేత వస్త్ర ఉత్పత్తికి వినియోగించే చిలపనూలు, జరీ, పట్టు, రంగులు, రసాయనాలను సబ్సిడీ రేట్లకు సరఫరా చేయాలి. నిల్వ వున్న చేనేత వస్త్రాలను ప్రభుత్వ సంస్థల అవసరాల నిమిత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ● తుపాను తదితర ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భాల్లో పనిలేక నష్టపోయిన చేనేత కుటుంబాలకు మత్స్యకారులకు అందించినట్టే జీవో నంబర్‌ 5 మేరకు నెలకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలి. ● ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ● నేతన్నలకు మూడు సెంట్లు భూమి ఇచ్చి అందులో హౌస్‌–కమ్‌–వర్క్‌ షెడ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలి. ● జౌళిశాఖలో అంతర్భాగంగా ఉన్న చేనేతను విడగొట్టి, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. చేనేత సహకార సంఘాల పాలక మండళ్లకు ఎన్నికలు నిర్వహించాలి. ● చేనేత కార్మికులకు కనీస వేతన చట్టాన్ని తీసుకురావాలి.

విపరీతంగా పెరిగిన ధరలు

కానరాని నేతన్న నేస్తం

ఉపవృత్తులకు అందని ఉచిత విద్యుత్‌

ఐక్యపోరాటానికి సిద్ధమైన నేతన్నలు

నేడు చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద చేనేతల ధర్నా

నగరి : జిల్లాలో చేనేతపై ఆధారపడి సుమారు 5 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, 15 వేల మంది పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారికి గత ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా ప్రతి ఏటా రూ.24 వేలు ఇచ్చి ఆదుకుంది. ప్రభుత్వం మారడంతో నేతన్న నేస్తం అటకెక్కింది. ప్రతి ఏటా రూ.25 వేలు ఇస్తామన్న ప్రస్తుత ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదు. ఇటీవల ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో రోజంతా పనిచేసినా రూ.400 సంపాదించలేకపోతున్నామని నేతన్నలు అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ప్రకటించినా అది కంటితుడుపుగా మారింది. చేనేతపై ఆధారపడిన అనుబంధ రంగాల వారికి దానిని వర్తింపజేయలేదు. దీంతో చేసేదేమీ లేక న్యాయం కోసం చేనేతన్నలు పోరాటానికి దిగారు. తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట చేనేత ఐక్యపోరాట సమితి పేరిట ధర్నా చేపట్టనున్నారు. జిల్లాలోని 16 సంఘాల వారు ఈ కార్యక్రమంలో కలుసుకోవాలని పిలుపునిచ్చారు.

చేనేతల ధర్నాలో ప్రధాన డిమాండ్లు

మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన చేనేత పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ముడి సరుకులైన నూలు, రంగులు, జరీ, పట్టు, రసాయనాలు, రవాణా ఖర్చులు పెరగడంతో చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ, మార్కెటింగ్‌, ప్రచారం లేకపోవడం, చేనేత సహకార సంఘాల నిర్వీర్యం తదితర కారణాలతో చేనేత వస్త్రాల తయారీ ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో చేనేత పరిశ్రమ ముందడుగు వేయలేకపోతోంది. భావితరం సైతం చేనేత వృత్తిని కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement