టమాటాలను మేమే అమ్ముకుంటాం | - | Sakshi
Sakshi News home page

టమాటాలను మేమే అమ్ముకుంటాం

Jun 22 2026 12:18 AM | Updated on Jun 22 2026 12:18 AM

కర్ణాటక మండీలకు ఇక్కడికి ధరల్లో తేడా ఇక్కడ 15 కేజీల బాక్స్‌ చూపి 17 కిలోలు నొక్కేస్తున్నారు అన్ని మండీల్లో వేలం ముగిశాకే ఇక్కడ వేలం పాటలు వ్యాపారుల తీరుపై రైతుల ఆగ్రహం

పలమనేరు: రైతులను మోసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ఇలాగే చేస్తే తామే బాక్సులు తెప్పించి సరుకును విక్రయిస్తామంటూ టమాటా రైతులు స్థానిక మండీ వ్యాపారులకు అల్టిమేటం జారీ చేశారు. పొరుగునే ఉన్న కర్ణాటకలోని కోలారు మార్కెట్‌కు, ఇక్కడికి ధరల్లో వ్యత్యాసం ఉందని తెలిపారు. వారు ఆదివారం మార్కెట్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఆపై మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజన్నను పిలిపించి స్థానిక మండీ వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ పొరుగునే ఉన్న కోలారులో టక్‌పట్టీ ద్వారా తక్కువ కమీషన్‌తో రైతుకు మేలు కలిగేలా వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. దీంతో గిట్టుబాటు ధరలు దక్కుతున్నాయన్నారు. ఇక్కడ 15 కిలోల బాక్సు అంటూ 17 కేజీల బాక్సుల్లో కాయలు నొక్కేస్తున్నారని నిరూపించారు. వ్యాపారులు తమ మండీల వద్ద సరుకును ఎక్కువగా ఉంచుతుండడంతో తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. మార్కెట్‌కు వచ్చే ఇతర కూరగాయలను ఎక్కడ పెట్టుకోవాలో, ఎక్కడ వేలం వేయాలో కూడా అర్థం కావడం లేదన్నారు. దీనిపై స్పందించిన చైర్మన్‌ రాజన్న మార్కెట్‌లోని దక్షిణం వైపు కూరగాయల వేలంపాట నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు కూరగాయల వేలాన్ని ఇకపై ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 9 గంటల లోపు పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశారు. చుట్టుపక్కలున్న మార్కెట్లతో పాటే ఇక్కడ కూడా వేలం పాటలు నిర్వహించేలా చూడాలన్నారు. రైతులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై మార్కెట్‌ అధికారులు చర్యలు తీసుకోకుంటే తామే బాక్సులు తెచ్చి వ్యాపారులతో మాట్లాడి సరుకు నేరుగా అమ్ముకుంటామని అల్టిమేటం జారీ చేశారు. ఇందులో రైతులు కూర్మాయి రవి, బేరుపల్లి గోవిందు రెడ్డి, బాలాజీ, దేవా, ఉమాపతి, నరేష్‌, రామాపురం హరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement