చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి అర్హుడికీ ఏబీహెచ్‌ఏ ఖాతా సృష్టించడంతోపాటు ప్రతి టీబీ రోగిని నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేసి, చికిత్స పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా అదనపు వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వెంకట ప్రసాద్ ఆదేశించారు. చిత్తూరులోని సత్యనారాయణ పురం, టెలిఫోన్ కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల ను ఆయన శుక్రవారం సందర్శించి, వైద్య సేవల అమలును సమీక్షించారు. సత్యనారాయణపురం యూపీహెచ్‌సీలో ఓపీ సేవలు, టాటా డిజిటల్ నర్వ్ సెంటర్ ద్వారా అందిస్తున్న డిజిటల్ ఆరోగ్య సేవలు, ఏబీహెచ్ ఏ నమోదులు, డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణను పరిశీలించారు. రోగులతో మాట్లాడి మందుల లభ్య త, వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకుని, అర్హులందరికీ ఏబీహెచ్‌ఏ ఖాతాలు సృష్టించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం టెలిఫోన్ కాలనీ యూపీహెచ్‌సీలో ప్రయోగశాల సేవలు, టీబీ నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసుల నిర్వహణ, నిక్షయ్ పోర్టల్ న మోదులు, రోగుల ఫాలోఅప్, పోషకాహార సహాయం అమలును సమీక్షించారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య, ఆరోగ్య సిబ్బందికి సూచించారు.


