మామిడికి ఉరే! | - | Sakshi
Sakshi News home page

మామిడికి ఉరే!

Jun 18 2026 1:41 AM | Updated on Jun 18 2026 1:41 AM

● రెండేళ్లుగా గిట్టుబాటు కాని తోతాపురి ● కిలో రూ.3, రూ.4కే కొనుగోలు ● కూలీల ఖర్చులూ రాక రైతుల విలవిల ● పంట పండిస్తే నష్టం.. కట్టెలుగా అమ్మితేనే లాభం ● ప్రత్యామ్నాయం వైపు రైతుల అడుగులు

కాణిపాకం: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 90వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. తోతాపురి రకాన్ని అత్యధికంగా సాగు చేస్తుంటారు. ఈ పంటపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే గత రెండేళ్లుగా మామిడి రైతులను వరుసగా నష్టాలే వెంటాడుతున్నాయి. గత ఏడాది తోతాపురి మామిడి కిలోకు రూ.3, రూ.4 మాత్రమే చెల్లించగా.. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి దాపురించింది. పంటను అమ్మేందుకు ర్యాంపుల వద్ద రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సి వస్తోంది. చివరకు చెప్పిన ధరకు అమ్మక తప్పడం లేదు.

గతేడాది నుంచే నరికివేత

గత ఏడాది తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వందల హెక్టార్ల మామిడి తోటలు నేలమట్టమయ్యాయి. చిత్తూరు, తవణంపల్లి, గుడిపాల, యాదమరి, బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, పూతలపట్టు మండలాలతో పాటు తిరుపతి జిల్లాలోని పాకాల, చంద్రగిరి, భాకరపేట, చిన్నగొట్టికల్లు, ఎరవ్రారిపాళ్లెం ప్రాంతాల్లో రైతులు భారీ ఎత్తున తోటలను తొలగించారు. ఈ ఏడాది కూడా తోతాపురి కోతలు పూర్తయిన వెంటనే మరిన్ని తోటలను నరికేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వరుసగా నష్టాలు వస్తుండడంతో మామిడి సాగును పూర్తిగా వదిలేసి పనస, కొబ్బరి, బొప్పాయి, అరటి, కూరగాయలు, పూలు తదితర ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తున్నారు.

సిండికేట్‌తోనే నష్టం

జిల్లాలోని పల్ప్‌ ఫ్యాక్టరీలు సిండికేట్‌గా మారి మామిడి ధరలను తమకు అనుకూలంగా నిర్ణయిస్తున్నాయి. పోటీ లేకపోవడంతో రైతు చేతిలో బేరసారాల శక్తి లేకుండా పోతోంది. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించకపోవడం, ఫ్యాక్టరీలపై నియంత్రణ లేకపోవడం, మార్కెట్‌లో జోక్యం చేసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు విమర్శిస్తున్నారు.

తొలగిస్తే.. కేసులట!

మామిడి తోటలను తొలగిస్తున్న రైతులపై కొన్నిచోట్ల అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. సొంత భూమిలో తాము సాగు చేసిన చెట్లను తొలగించుకుంటే అది ఎలా నేరమవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం, ఇప్పుడు తోటలు తొలగించుకుంటే కేసులు పెట్టడం దారుణమని మండిపడుతున్నారు. కొందరు రాజకీయ కక్షసాధింపులో భాగంగానే రైతులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేయిస్తున్నారని మండిపడుతున్నారు.

మామిడి రైతుకు గడ్డుకాలం దాపురించింది. చెమటోడ్చి పండించిన కాయలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోవాల్సి వస్తోంది. కాయలు అమ్ముకుని వచ్చే డబ్బుకంటే చెట్లను నరికి కట్టెలుగా అమ్ముకుంటేనే ఎక్కువ ఆదాయం వస్తోందన్న చేదు వాస్తవం జిల్లాలో వినిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న మామిడి తోటలపై రైతులే గొడ్డలి వేస్తున్న దృశ్యాలు గ్రామాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

మద్దతు ధర ఇవ్వాలి

రెండేళ్లుగా పంట పుష్కలంగా ఉంది. కానీ ధరలు లేవ్‌. ఫ్యాక్టరీల వద్ద పంట అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నాం. ఈ బాధలు పడలేక.. ప్రత్యామ్నాయం చూస్తున్నాం. మామిడి చెట్లను తొలగించి.. పనస పెడదామనకుంటే అటవీశాఖ అధికారులు కేసులు పెట్టించి జరిమానా వేశారు. కాయలు అమ్ముకోలేక రైతులు అల్లాడుతున్నారు.

–కుమార్‌, తుమ్మింద, చిత్తూరు మండలం

అటవీశాఖ అనుమతులెందుకు?

మామిడికి ధరలు లేక నిండా మునిగిపోయాం. ప్రత్యామ్నాయం చూసుకుందామనుకుంటే.. అటవీశాఖ అధికారులు మామిడి చెట్లు నరకూడదంటున్నారు. మామిడి అనేది ఓ పంట. ఆ పంట పండకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటాం. ఇది రైతు ఇష్టం. అలాంటప్పుడు మామిడికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి.

–కొత్తూరు బాబునాయుడు, రైతు నాయకుడు, చిత్తూరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement