టీడీపీ కార్యాలయాల్లో బీఎల్‌ఓలకు ఏం పని? | - | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యాలయాల్లో బీఎల్‌ఓలకు ఏం పని?

Jun 18 2026 1:41 AM | Updated on Jun 18 2026 1:41 AM

● అధికార పార్టీ బీఎల్‌ఏల వద్దకు కలర్‌ జిరాక్స్‌లా? ● బీఎల్‌ఓలకు ‘సర్‌’ గురించి అవగాహన లేదా? ● ఓటర్లకు ముందస్తు అవగాహన ఎందుకు కల్పించలేదు? ● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ‘సర్‌’పై ఎన్నో అనుమానాలు

● అధికార పార్టీ బీఎల్‌ఏల వద్దకు కలర్‌ జిరాక్స్‌లా? ● బీఎల్‌ఓలకు ‘సర్‌’ గురించి అవగాహన లేదా? ● ఓటర్లకు ముందస్తు అవగాహన ఎందుకు కల్పించలేదు? ● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ‘సర్‌’పై ఎన్నో అనుమానాలు

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘సర్‌’ ప్రక్రియపై ఓటర్లలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులంతా స్థానిక టీడీపీ కార్యాలయాలకు వెళ్లి మ్యాపింగ్‌ చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేనా పారదర్శకమైన, సమగ్రమైన ఓటర్ల జాబితా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఏం జరుగుతోందనే ఆందోళన అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు ఓటర్లలో మొదలైంది.

అంతా మా ఇష్టం

‘సర్‌’ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి బీఎల్‌ఓలు రాజకీయ పార్టీ నాయకులతో సంబంధం లేకుండా ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేయాలి. ఆ తరువాత ఓటరు ఉన్నారా? లేదా? విచారించాలి. అనంతరం మ్యాపింగ్‌ చేయాల్సి ఉంది. అయితే బీఎల్‌ఓలు 2002 ఓటర్ల జాబితా, ప్రస్తుత జాబితాను పట్టుకుని ఇంటి పేర్లతో సరిపోయినవి, వారికి బంధుత్వం ఉన్నవి, టీడీపీ బీఎల్‌ఏలు చెప్పినవి మ్యాపింగ్‌ చేసేస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 65 శాతానికి పైగా మ్యాపింగ్‌ జరిగిపోయినట్టు సమాచారం. ఇదంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరిగిపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో స్థానికంగా ఉన్న అనేక మంది ఓట్లు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అవగాహన లేదు ‘సర్‌’

‘సర్‌’ ప్రకియపై తమకు అవగాహనే లేదని కొందరు బీఎల్‌ఓలు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా బీఎల్‌ఓలకు అవగాహన కల్పించాల్సి ఉందని చెబుతున్నారు. ఆ తరువాత ఓటర్లకు కూడా ‘సర్‌’పై అవగాహన కోసం గ్రామాలు, వీధుల్లో ప్రచారం చేయాలని సూచిస్తున్నారు. అయితే ఇవేమీ లేకుండానే ఏకంగా ‘సర్‌’ ప్రకియ మొదలు పెట్టేశారని బీఎల్‌ఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు అవగాహన లేకపోవడం వల్లే అనేక తప్పులు దొర్లుతున్నాయని, మరి కొద్ది రోజులు గడిస్తే గానీ ‘సర్‌’ పై పూర్తి స్థాయిలో అవగాహన వచ్చే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.

ముస్లిం మైనారిటీల్లో కలకలం

ముస్లిం, మైనారిటీ ఓట్లు తమకు పడవనే ఉద్దేశంతో కూటమి నేతలు వారి ఓట్లను తొలిగించేస్తున్నట్లు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మ్యాపింగ్‌ కోసం వివరాలు ఇవ్వొద్దని, ఇస్తే.. బయట తరమిస్తారనే భయం పుటించినట్లు తెలిసింది. అందులో భాగంగానే కొందరు ముస్లిం, మైనారిటీలు బీఎల్‌ఓలకు వివరాలు ఇవ్వడం లేదని సమాచారం. పుంగనూరు, వీ కోట, పలమనేరు, తిరుపతిలో ఇటువంటి ప్రచారం చేస్తున్నట్లు ముస్లిం, మైనారిటీలు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement