చిత్తూరుకు ఇద్దరు ఏఎస్పీలు | - | Sakshi
Sakshi News home page

చిత్తూరుకు ఇద్దరు ఏఎస్పీలు

Jun 18 2026 1:41 AM | Updated on Jun 18 2026 1:41 AM

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు పోలీసు జిల్లాకు ఇద్దరు అదనపు ఏఎస్పీలను నియమిస్తూ బుధవారం ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఆదేశాలు జారీచేశారు. తిరుపతిలో పనిచేస్తున్న కె రవిమనోహరాచారిని చిత్తూరు పరిపాలన విభాగానికి, పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న షానుషేక్‌ను చిత్తూరు ఆపరేషను్‌ుస్క బదిలీ చేశారు.

స్టాంప్‌ పేపర్స్‌ లేక తిప్పలు

చిత్తూరు కార్పొరేషన్‌: చిత్తూరు అర్బన్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో స్టాంప్‌ పేపర్స్‌ కోసం కోనుగోలుదారులు పడిగాపులు కాస్తున్నారు. ఇటీవల స్టాంప్‌ కౌంటర్‌ విభాగం సీనియర్‌ సహాయకులు ఆర్యోగం సరిలేక సెలవు పెట్టారు. ఆ స్థానంలో ఇన్‌చార్జి ఉద్యోగులకు విషయ పరిజ్ఞానం లేక వినియోగదారులతో అమర్యాదగా మాట్లాడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సమయపాలన పాటించక స్టాంప్‌ కౌంటర్‌ను ఆలస్యంగా తెరుస్తున్నారు. దీనికి తోడు సకాలంలో వేగంగా సేవలందించకపోవడంతో క్యూలైన్‌ ఏర్పడుతోంది.

బాలల హక్కుల

పరిరక్షణకు ప్రాధాన్యం

చిత్తూరు కలెక్టరేట్‌ : బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు వెంకట పద్మలత చెప్పారు. బుధవారం ఆమె జిల్లా కేంద్రంలోని సంజయ్‌గాంధీ నగర్‌లో ఉన్న అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ బాలలు, మహిళలకు నాణ్యమైన సేవలందించడంలో ఎలాంటి అలసత్వం వహించరాదన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను అధికారులు కచ్చితంగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారి శక్తి సామర్థ్యాలను పెంపొందించడం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ వెంకటేశ్వరి, అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలల డీసీవో పద్మజ, డీవైఈవో ఇందిరా పాల్గొన్నారు.

20న జిల్లాకు రాష్ట్ర బీసీ

అంకితభావ కమిషన్‌ రాక

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి అంకితభావ కమిషన్‌ ఈ నెల 20వ తేదీన జిల్లాలో పర్యటించనుందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐఏఎస్‌ (రిటైర్డ్‌) అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలోని ఈ ఉన్నత స్థాయి బృందం జిల్లాకు రానున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి ఈ కమిషన్‌ వినతులు, అభ్యర్థనలను స్వీకరించనుందన్నారు. జిల్లాలోని వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుపై ఈ కమిషన్‌ క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్నట్టు వెల్లడించారు. పర్యటనలో భాగంగా ఈ నెల 20వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ భవనంలో బహిరంగ విచారణ, ముఖాముఖి నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని బీసీ వర్గాల ప్రజలు, సంఘాల నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు.

విధి నిర్వహణలో

అవకతవకలు

చిత్తూరు కలెక్టరేట్‌ :జిల్లాలోని వి.కోట మండలంలో అసైన్డ్‌ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్‌ చేయడానికి నిబంధనలకు విరుద్ధంగా ఆమోదాలు, సిఫార్సులు చేశారనే ఆరోపణలపై నలుగురు రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. విచారణాధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, డీఆర్వో ప్రెజెంటింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. అప్పటి వీకోట తహసీల్దార్‌ చిట్టిబాబు, వీ కోట మండలం, మద్దిమాకులపల్లి వీఆర్‌ఓ యామిని, పాముగానిపల్లి వీఆర్‌ఓ నారాయణ, బైరెడ్డిపల్లి మండలం, వీఆర్వో భరణికుమార్‌లకు నోటీసులు జారీచేశారు.

19న వ్యక్తిగత హాజరుకు ఆదేశం

ఈ ఆరోపణలకు సంబంధించి నలుగురు అధికారులు ఈ నెల 19న కలెక్టరేట్‌లోని జాయింట్‌ కలెక్టర్‌ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులో స్పష్టం చేశారు. ఆ సమయంలో తమపై వచ్చిన చార్జీలకు సంబంధించి లిఖితపూర్వక వివరణను సమర్పించాల్సి ఉంటుందన్నారు. విచారణకు హాజరుకానిపక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని నోటీసులో హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement