కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పాలకమండలి ఊరటనిచ్చింది. వారి జీతభత్యాల పెంపునకు ఆమోదం తెలిపింది. బుధవారం దేవస్థానం ఈవో కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను సమావేశంలో చర్చించి, వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నిత్యాన్నదాన విభాగం, ఇటీవల ప్రారంభించిన వినాయక సదన్‌న్‌లో సిబ్బంది కొరత ఉన్నందున అదనపు సిబ్బందిని నియమించే అంశంపై కూడా చర్చించారు. ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం, వార్షిక టెండర్ల నిర్వహణ, లడ్డూపోటులో తయారయ్యే లడ్డూల నాణ్యతపై సుదీర్ఘంగా చర్చించారు. ఏఈవోలు ప్రసాద్, ఎస్‌వీ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ధనంజయ, సీఎఫ్‌వో నాగేశ్వరరావు పాల్గొన్నారు.


