జంతుబలిని అడ్డుకున్న అధికారులు
పూతలపట్టు(యాదమరి): మండల పరిధి తిమ్మిరెడ్డిపల్లి గ్రామంలో గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం నిర్వహించ తలపెట్టిన జంతు బలిని పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. స్థానికుల కథనం.. గ్రామంలో మంగళవారం నుంచి గంగమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం అమ్మవారికి సుమారు రూ.50 వేల విలువైన దున్నపోతును బలిచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ విషయమై అదే గ్రామానికి చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం రాత్రి జిల్లా కలెక్టరుకు రహస్యంగా సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ రెవెన్యూ, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టరు ఆదేశాల మేరకు గ్రామానికి చేరుకున్న అధికారులు జాతర నిర్వహకులు, గ్రామ పెద్దలతో మాట్లాడి జంతు బలి ఇవ్వకుండా అడ్డుకున్నారు.


