క్షేత్ర స్థాయిలో అవగాహన లోపం ప్రకటనలకే తప్ప చిన్నారులకు చేరని సమాచారం అవగాహన కల్పించడంలో వెనుకబడిన ఐసీడీఎస్ పథకానికి దూరమవుతున్న వేలాది మంది అనాథలు
చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య పథకం క్షేత్ర స్థాయిలో నీరుగారుతోంది. ఐసీడీఎస్ అధికారుల సమన్వయ లోపం, నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం చేరనంటోంది. అనాథలుగా మారుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉద్దేశించిన ఈ పథకం పై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కనీస అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రకటనలు, కార్యాలయాలకే పరిమితమవుతూ సమీక్షల హడావుడి తప్ప, నిజమైన లబ్ధిదారులను గుర్తించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్షేత్ర స్థాయిలో శూన్యం
పథకం అమలులో ఏటా వందల సంఖ్యలో చిన్నారులు లబ్ధిపొందుతున్నారని అధికారులు కాగితాల్లో లెక్కలు చూపిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువు మధ్యలో ఆగిపోయిన పిల్లలు, తల్లిదండ్రులు లేని నిస్సహాయ చిన్నారులు ఎందరో ఉన్నప్పటికీ తమకు నెలకు ఆర్థిక సహాయం అందించే మిషన్ వాత్సల్య లాంటి పథకం ఒకటి ఉందనే విషయమే బాధితులకు తెలియడం లేదు. అసలు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏయే రికార్డులు సమర్పించాలి? అనే వివరాలు అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఐసీడీఎస్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫొటోలకే పరిమితం
ఐసీడీఎస్ అధికారులు అప్పుడప్పుడూ మండల కేంద్రాల్లో నిర్వహించే అవగాహన సదస్సులు కేవలం ఉన్నతాధికారులకు నివేదికలు పంపేందుకు, ఫొటోలు దిగడానికే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నిజంగా ఎవరికై తే ఈ పథకం అవసరమో, ఆ అనాథ చిన్నారుల ఇళ్లకు వెళ్లి, వారి సంరక్షులతో మాట్లాడి దరఖాస్తులు చేయించాల్సిన బాధ్యతను అధికారులు విస్మరిస్తున్నారు. ఇప్పటికై నా ఐసీడీఎస్ అధికారులు స్పందించి కేవలం కార్యాలయాల్లో కూర్చోకుండా క్షేత్ర స్థాయిలోమిషన్ వాత్సల్యపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, అర్హులైన ప్రతి అనాథ చిన్నారికి ఆసరా దక్కేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.


