గుడిపాల: పంటలపై ఏనుగుల బీభత్సం సృష్టించాయి. అటవీశాఖ అధికారులు బుధవారం తెల్లవారుజామున ఏనుగల మందను తమిళనాడు అటవీ ప్రాంతానికి తరలించారు. తుమ్మిందపాళ్యం ఫారెస్ట్ నుంచి తమిళనాడు అటవీ ప్రాంతానికి తరలించారు. వాటిని తరలించే సమయంలో రామభద్రాపురం, క్రిష్ణాపురం సమీపంలోని వరి, అరటి, మామిడి పంటలను ధ్వంసం చేసి వెళ్లాయి. అటవీశాఖ సిబ్బంది, ట్రాకర్స్ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఏనుగులను తరలించారు.
షుగర్ ఫ్యాక్టరీలో
అగ్ని ప్రమాదం
శ్రీరంగరాజపురం : మండలంలోని నెలవాయి వద్ద ఉన్న ఎస్.ఎన్.జే షుగర్ ఫ్యాక్టరీలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ గిరి కథనం.. ఫ్యాక్టరీ అవసరాల కోసం నల్లబొగ్గును నిల్వ చేశారు. ఆ బొగ్గుకు డంపింగ్ పక్కన ఉన్న లెదర్ అంటుకోవడంతో మంటలు వ్యాప్తించాయి. సిబ్బంది అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక, ఫ్యాక్టరీ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ తెలిపారు.
చోరీ కేసులో ఇద్దరికి జైలు
బద్వేలు అర్బన్ : బద్వేలు అర్బన్ పోలీసు స్టేషన్‌లో గతేడాది నమోదైన ఓ చోరీ కేసులో ఇద్దరు నిందితులకు బుధవారం 15 నెలలు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పి.ముఖేష్‌కుమార్ తీర్పు ఇచ్చినట్లు అర్బన్ సీఐ బి.రామకృష్ణ తెలిపారు. ప్రకాశం జిల్లా సీఎస్.పురం మండలం కొండరాజుపల్లె గ్రామానికి చెందిన కొండరాజు సురేష్, చిత్తూరులోని కామరాజనగర్‌కు చెందిన షేక్‌మస్తాన్ బద్వేలులోని విద్యానగర్‌లో రాయల్ బుల్లెట్ వాహనాన్ని చోరీ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి పక్కా ఆధారాలతో నిందితులను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు.
సూర్యఘర్ పనుల్లో
వేగం పెంచాలి
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ సూర్యఘర్ పనుల్లో వేగం పెంచాలని ట్రాన్స్‌కో ప్రాజెక్టు డైరెక్టర్ ఆయూబ్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్‌ఈ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ నిర్ణీత సమయం లోపు పీఎం సూర్యఘర్ ప్యానల్స్ ఏర్పాటును పూర్తి చేయాలన్నారు. అలాగే జనరల్ కేటగిరిలో బిగించే సూర్యఘర్ సోలార్ ప్యానళ్ల అమరిక కూడా మందకొడిగా సాగుతోందన్నారు. 300 యూనిట్లు వచ్చే సర్వీసులకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసేవిధంగా వారికి అవగాహన కల్పిం చాలన్నారు. అదేవిధంగా ఆర్డీఎస్‌ఎస్ పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయన్నారు. పెండింగ్ కరెంటు బిల్లులు, వసూళ్ల పై కూడా దృష్టి సారించాలని ఆదేశించారు. ఎనర్జీ డిపార్ట్‌మెంట్ ఓఎస్‌డీ జానకీరామ్, ఈఈలు మునిచంద్ర, భాస్కర్‌నాయుడు పాల్గొన్నారు.
అత్తారింటికొచ్చి..!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అత్తారింటికి వచ్చిన ఓ వ్యక్తి తిరుగు ప్రయాణంలో కారులోనే మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం చిత్తూరు నగర శివారులోని పెనుమూరు క్రాస్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. తిరుపతికి చెందిన సూర్యనారాయణ (47) రెండు రోజులకు క్రితం మురకంబట్టులోని అత్తారింటికి వచ్చాడు. బుధవారం తిరిగి తిరుపతి బయలుదేరాడు. ఈ క్రమంలో పెనుమూరు క్రాస్ వద్ద బండి పార్క్ చేశాడు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆ వ్యక్తి కారులోనే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు గుండె పోటుతో చనిపోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.


