కూటమి కనుసన్నల్లోనే సర్‌ | - | Sakshi
Sakshi News home page

కూటమి కనుసన్నల్లోనే సర్‌

Jun 18 2026 1:41 AM | Updated on Jun 18 2026 1:41 AM

● యాదమరిలో ‘సర్‌’ అక్రమాల పర్వం ● వైఎస్సార్సీపీ నేతలకు కనీస సమాచారం ఇవ్వని వైనం ● ఏకపక్షంగా కానిచ్చేస్తున్న అధికారులు ● నిలదీసిన వైఎస్సార్సీపీ నేతలు ● దిక్కుతోచక ప్రక్రియ నిలిపేసిన సిబ్బంది

యాదమరి: మండలంలో నిర్వహిస్తున్న ‘సర్‌’ కార్యక్రమం గాడితప్పుతోంది. క్షేత్ర స్థాయిలో నిస్పక్షపాతంగా విధులు నిర్వహించాల్సిన కొందరు బూత్‌ స్థాయి అధికారులు పూర్తిగా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. కొందరు అధికార కూటమి నేతల అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధులకు, అన్ని రాజకీయ పార్టీలకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఇక్కడి అధికారులు మాత్రం వైఎస్సార్సీపీ నాయకులకు మాత్రమే కనీస సమాచారం ఇవ్వడం లేదు. కూటమి నాయకులకు ఏకపక్షంగా లబ్ధి చేకూర్చడానికి ఈ దొంగచాటు తతంగం నడుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిలదీసిన వైఎస్సార్సీపీ

అధికారుల ఏకపక్ష పోకడలపై మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు, స్థానికులు తిరగబడ్డారు. మంగళవారం మండలంలోని గాంధీపురం, బుధవారం కాశీరాళ్ల సమీపంలోని కొండమిట్ట గ్రామంలో ఓ మహిళా అధికారిణి కొందరు కూటమి నాయకులతో కలసి రహస్యంగా ‘సర్‌’ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నించారని ఎంపీటీసీ దూర్వాశులు ఆరోపించారు. ఈ చీకటి వ్యవహారాన్ని గుర్తించిన వైఎస్సాసీపీ నేతలు, కార్యకర్తలు క్షేత్ర స్థాయికి చేరుకుని సంబంధిత బీఎల్వోని నిలదీశారు. ముందస్తు సమాచారం తమకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అయితే విపక్ష నేతల నిలదీతకు సమాధానం చెప్పలేక సదరు బీఎల్‌ఓ నీళ్లు నమిలారు. స్థానికుల నుంచి నిరసన తీవ్రం కావడంతో దిక్కుచోచని అధికారులు చేసేదేమీ లేక ప్రక్రియను మధ్యలోనే నిలిపివేసి వెళ్లిపోయారు.

సమాచారం ఎందుకివ్వరు?

క్షేత్ర స్థాయిలోకి వచ్చే బీఎల్‌ఓలు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు ముందస్తు సమాచారం ఎందుకువ్వడం లేదు. అధికార పార్టీ నాయకులతో కుమ్మకయ్యి మీ ఇష్టానుసారం చేస్తామంటే చూస్తూ ఊరుకోం. కేవలం కోందరి నాయకులకు లబ్ధి చేకూర్చేలా ఉన్న ఈ సర్‌ ప్రక్రియపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

–దూర్వాశులు, ఎంపీటీసీ, కాశిరాళ్ల

చర్యలు తీసుకుంటాం

మండలంలో ‘సర్‌’ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. నిష్పక్ష పాతంగా నిర్వహించేలా బీఎల్‌ఓలకు ఆదేశాలు జారీ చేశాం. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని అత్యంత పారదర్శకంగా చేపడుతాం. క్షేత్ర స్థాయిలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ప్రజలకు ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయ్యడానికి సిద్ధంగా ఉన్నాం.

–పార్థసారథి, తహసీల్దార్‌, యాదమరి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement