ఫోర్జరీ ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఫోర్జరీ ముఠా అరెస్ట్‌

Jun 18 2026 1:41 AM | Updated on Jun 18 2026 1:41 AM

నకిలీ సీళ్లు, సంతకాలతో భూ దందా 18 సీళ్లు స్వాధీనం కార్వేటినగరం డాక్యుమెంట్‌ రైటర్‌ కీలక సూత్రధారి ఎస్‌ఆర్‌పురం, కార్వేటినగరం, వెదురుకుప్పంలో ఫోర్జరీ దందాలు

శ్రీరంరాజుపురం: రెవెన్యూ అధికారుల పేరుతో నకిలీ అనుభవ ధ్రువీకరణ పత్రాలు, తహసీల్దారు, పంచాయతీ కార్యదర్శుల నకిలీ సీళ్లతో భూముల రిజిస్ట్రేషన్లు జరిపిస్తున్న ఫోర్జరీ ముఠాపై పోలీసులు కొరడా ఝుళిపించారు. శ్రీరంగరాజపురం మండలంలో బుధవారం వెలుగుచూసిన ఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, వారి వద్ద నుంచి 18 నకిలీ సీళ్లు, ఫోర్జరీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఆర్‌పురానికి చెందిన మహేష్‌కు సంబంధించిన ఇంటిని అదే ప్రాంతానికి చెందిన త్యాగరాజు పేరుతో నకిలీ అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని తయారు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ విషయాన్ని గుర్తించిన మహేష్‌ స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో.. కార్వేటినగరం మండలానికి చెందిన డాక్యుమెంట్‌ రైటర్‌ లవ్‌కుమార్‌, ఎస్‌ఆర్‌పురం మండలం వడ్డిపల్లికి చెందిన యోగానంద్‌ అలియాస్‌ ఉమాపతిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వివిధ మండలాల తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శుల పేర్లతో తయారు చేసిన మొత్తం 18 నకిలీ సీళ్లు, ఫోర్జరీ పత్రాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని నకిలీలు కూడా!

ఈ కేసులో లవ్‌కుమార్‌ పాత్రపై స్థానికంగా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్‌ఆర్‌పురం, కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాల్లో ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీకి ఇతడే కేంద్రబిందువని బాధితులు ఆరోపిస్తున్నారు. గత ఆరు నెలలుగా అతని ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే మరిన్ని నకిలీ పత్రాల వ్యవహారాలు బయటపడే అవకాశముందని సమాచారం.

అమాయకులే టార్గెట్‌

రెవెన్యూ అధికారుల ధ్రువీకరణను ఆసరాగా చేసుకుని కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు నకిలీ సంతకాలు, సీళ్లు తయారు చేసి ఒక్కో వ్యక్తి నుంచి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఫోర్జరీ దందా ద్వారా భారీగా అక్రమంగా సంపాదించి కార్వేటినగరం, తిరుపతి, పుత్తూరు, బెంగళూరు, చైన్నె ప్రాంతాల్లో విలాసవంతమైన భవనాలు, ప్లాట్లు, భూములు కొనుగోలు చేశారని సమాచారం. ఈ కోణంలోనూ సమగ్ర విచారణ జరపాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఫోర్జరీ పత్రాలు, నకిలీ సీళ్లు, సంతకాల తయారీలో ఎవరైనా పాల్గొన్నా కఠిన చర్యలు తప్పవని కార్వేటినగరం సీఐ హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement