ఖైదీలకు రూ.100, హాస్టల్‌ విద్యార్థులకు రూ.53? | - | Sakshi
Sakshi News home page

ఖైదీలకు రూ.100, హాస్టల్‌ విద్యార్థులకు రూ.53?

Jun 18 2026 1:41 AM | Updated on Jun 18 2026 1:41 AM

● హాస్టల్‌ విద్యార్థులపై చిన్నచూపు తగదు ● పెరిగిన ధరల ప్రకారం మెస్‌, కాస్మొటిక్‌ చార్జీలివ్వాలి ● ఏఐఎస్‌ఎఫ్‌ ధర్నా

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల విద్యార్థులపై చంద్రబాబు సర్కారు చిన్నచూపు చూడడం తగదని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంఘ నాయకులు బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జైళ్లలో ఉన్న ఖైదీల భోజన వసతులకు రోజుకు రూ.100కు పైగా బడ్జెట్‌ కేటాయిస్తున్న ప్రభుత్వం.. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే హాస్టల్‌ విద్యార్థులకు మాత్రం రూ.53 కేటాయించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గురుకుల, కేజీబీవీ హాస్టల్‌ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ.1,200, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు నెలకు రూ.1600 బడ్జెట్‌ కేటాయిస్తున్నారని, దీన్ని తక్షణమే రూ.2,500 నుంచి రూ.3000కు పెంచాలన్నారు.

పెండింగ్‌ బకాయిలు చెల్లించాలి

గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న హాస్టల్‌ మెస్‌ చార్జీలను, విద్యార్థుల కాస్మొటిక్‌ చార్జీల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రవీణ్‌ డిమాండ్‌ చేశారు. పాతబడిన హాస్టల్‌ భవనాలను మార్చాలన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని సూచించారు. దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న వార్డెన్‌, కుక్‌ (వంట మనుషులు), అటెండర్‌, కామాటి, ట్యూటర్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. ఈ ధర్నాలో ఏఐఎస్‌ఎఫ్‌ నగర నాయకులు గౌరవ్‌, లలిత్‌, లిఖిత్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement