ర్యాంపుల్లో కేజీ రూ.3, ఫ్యాక్టరీల్లో రూ.5
సిండికేట్‌కు ప్రభుత్వం అండ
రైతుల కడుపుకొడుతున్న ఫ్యాక్టరీల మాఫియా
ముంచేస్తున్న క్రిష్ణగిరి ధరల సాకు
●
కాణిపాకం: జిల్లాలో మామిడి రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఏడాది పొడవునా చెమటోడ్చి పండించిన తోతాపురి పంటకు ర్యాంపుల్లో రూ.3, ఫ్యాక్టరీల్లో రూ.5 మాత్రమే చెల్లిస్తుండడం వారిని మరింత కుంగదీస్తోంది. జిల్లా లోని పల్ప్ ఫ్యాక్టరీలు, కొనుగోలు ర్యాంపులు కుమ్మకై ్క రైతును నిండా ముంచేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది మామిడి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచే రైతుకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. బేనిషా, కాదర్, మల్లిక వంటి టేబుల్ రకాల మామిడికి ధర అంతతమాత్రంగా నే ఉంటోంది. చివరికి ‘తోతాపురి’ పరిస్థితి దారుణంగా తయారైంది. కొద్ది రోజుల కిందట కేజీ రూ.7 వరకు పలికిన తోతాపురి ఇప్పుడు అమాంతం పడిపోయింది. సోమవారం రాత్రి వరకు ఫ్యా క్టరీల్లో కేజీ రూ.6, ర్యాంపుల్లో రూ.4లుగా ఉన్న మామిడి మంగళవారం ఉదయానికి ఒక్కసారిగా కుప్పకూలింది. కిలో రూ.3–5కు పడిపోయింది.
ఫ్యాక్టరీల సిండికేట్
జిల్లాలో ఉన్న పల్ప్ ఫ్యాక్టరీలు పోటీపడి కొనుగో లు చేయాల్సింది పోయి ఒకే ధరను అమలు చేస్తున్నాయి. ఏ ఫ్యాక్టరీకి వెళ్లినా అదే ధర. ఏ ర్యాంపుకెళ్లినా అదే ధర. రైతుకు ప్రత్యామ్నాయం లేకపోతోంది. ‘మేము పండించిన పంటకు ధర నిర్ణయించేది మార్కెట్ కాదు.. ఫ్యాక్టరీలే. వాళ్లు చెప్పిందే రేటు. ఇవ్వకపోతే పంట కుళ్లిపోతుందటూ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
క్రిష్ణగిరి పేరు చెప్పి..!
ధరలు ఎందుకు తగ్గించారని అడిగితే ఫ్యాక్టరీలు ఒకే సమాధానం చెబుతున్నాయి. ‘తమిళనాడులోని క్రిష్ణగిరిలో ధరలు పడిపోయంటూ సాకులు చెబుతున్నారు. అక్కడ కాయలు కొనుగోలు చేసేవారు లేరని, పండిన పంటను కాలువలు, రోడ్లపైనే పడేస్తున్నారని, ఫ్యాక్టరీలు కేజీ రూ.5కు కొంటున్నారని సమాధానం ఇస్తున్నారు. దీనిపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్రిష్ణగిరిలో ధరలు పెరిగినప్పుడు చిత్తూరులో ఎందుకు పెంచలేదని నిలదీస్తున్నారు.
కొనుగోళ్లు అంతంత మాత్రమే
ధరలు తగ్గించడమే కాకుండా కొనుగోళ్లు కూడా పరిమితం చేశారు. ఫ్యాక్టరీలు ధరలను దెబ్బతీయడానికి అవసరమైన మేర కొనుగోలు చేస్తున్నామనే సాకులు చెబుతున్నాయి. దీంతో ఫ్యాక్టరీ చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కేవలం తమిళనాడు నుంచి వచ్చే లారీలను మాత్రమే ఫ్యాక్టరీ లోపలికి అనుమతిస్తున్నారు. నేడు కిలో మామిడిని తోట నుంచి ర్యాంపునకు తీసుకురావడానికి అయ్యే ఖర్చే రూ.2 నుంచి రూ.3 వరకు ఉంటోంది. ఎన్నికల సమయంలో రైతుకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
తోతాపురి రైతు గొంతు కోస్తున్న ధరల దందా
మా పరిస్థితి దారుణం
కేజీ రూ.6 నుంచి రూ.5కు పడిపో యింది. తగ్గిన ధర తో ఫ్యాక్టరీ ఎదుట నోటీసులు అతికిస్తే చించేశాం. ఇలాగైతే మా బతుకులు ఎలా...?. మా బాధలను ఎవరు పట్టించుకోవడం లేదు. ఇదిపోను సామాన్య రైతుల బండ్లు రోజుల తరబడి రోడ్లపైనే ఉంటున్నాయి. సిఫార్సు వస్తే ఠక్కుమని లోపలికి పంపించేస్తున్నారు. ఇంత దారుణం ఎప్పుడూ లేదు.
– రమేష్, జీడీనెల్లూరు మండలం
ధరలు తగ్గిస్తే ఎలా?
ఇష్టానుసారంగా ధరలు తగ్గించుకుంటూ పోతే ఎలా..?. ఈ రోజు తోతాపురి కేజీ రూ.5కు తగ్గించేశారు. ఇది పెద్ద మోసం. ఈ రకంగా రైతుల కడుపు కొట్టడం సరికాదు. ఇదేవిధంగా కొనసాగితే కచ్చితంగా రైతులంతా రోడ్డుపైకి రావడం ఖాయం. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. మామిడి రైతులను ఆదుకోవాలి.
– బాల, దిగువమాసాపల్లి, చిత్తూరు మండలం


