చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్‌ల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని వైఎస్‌ఆర్ కడప జిల్లా ఉన్నత విద్యాశాఖ ఆర్‌జేడీ మధుసూదన్‌వర్మ ఆదేశించారు. ఆయన మంగళవారం పలు డిగ్రీ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్‌తో సమావేశం నిర్వహించారు. ఆర్‌జేడీ మాట్లాడుతూ డిగ్రీ అడ్మిషన్ల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లను ముమ్మరంగా చేపట్టాలని స్పష్టం చేశారు. గత ఏడాది నమోదైన అడ్మిషన్ల సంఖ్య కంటే ఈసారి కచ్చితంగా ఎక్కువ అడ్మిషన్లు సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులను ఆకర్షించడంలో ప్రిన్సిపల్స్, అధ్యాపకులు చొరవ చూపాలని సూచించారు. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
న్యాక్ గ్రేడింగ్‌పై ప్రత్యేక దృష్టి
ప్రతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ అంచనా, గుర్తింపు మండలి (న్యాక్)లో ఉత్తమ గ్రేడ్ తెచ్చుకునేందుకు గట్టిగా కృషి చేయాలని ఆర్‌జేడీ అన్నారు. న్యాక్ గ్రేడింగ్ మెరుగుపడితేనే కళాశాలలకు జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుచేశారు. ప్రతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఒక ఉత్తమ విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు ఒక పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత వచ్చేలా ప్రతి అధ్యాపకుడు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా నోడల్ అధికారి, పీవీకేఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 19 డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.


