పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం తల్లిదండ్రులపై ఆర్థిక భారం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత రెట్టింపైన పుస్తకాలు, యూనిఫాం ధరలు ప్రభుత్వ నియంత్రణ శూన్యం మిడిల్ క్లాస్ కుటుంబాల్లో ఖర్చుల ఆందోళన
నగరి: స్కూల్ ఫీజుల నుంచి రవాణా ఖర్చుల వరకు భారీగా పెరిగిపోవడం భారంగా పరిణమిస్తోంది. పుస్తకాల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. వీటికి అదనంగా యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, షూస్ ధరలు మార్కెట్‌లో మండిపోతున్నాయి. దీంతో గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి చదువుల కోసం భారీగా జేబులు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
చుక్కలు చూపిస్తున్న రవాణా ఖర్చులు
ఇక స్కూల్ వ్యాన్లు, బస్సు చార్జీలు చూస్తే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలను సాకుగా చూపిస్తూ రవాణా చార్జీలను భారీగా పెంచేశారు. స్కూలుకు, ఇంటికి మధ్య దూరాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. స్కూల్ ఫీజులకు తోడు ఈ రవాణా ఖర్చు తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తోంది.
ప్రభుత్వ నియంత్రణ శూన్యం
ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులను పెంచుకుంటూ పోతున్నా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఫీజుల నియంత్రణపై కనీసం దృష్టి సారించడం లేదు. జిల్లా విద్యా శాఖ అధికారులు సైతం ప్రైవేటు యాజమాన్యాల దోపిడీని అరికట్టలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో కార్పొరేట్ విద్యా సంస్థలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రైవేటు స్కూల్స్ ఫీజులపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
జూన్ నెల రానే వచ్చింది. సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలు.. కళాశాలలు ప్రారంభోత్సవాల్లో ఉంటే తల్లిదండ్రుల్లో మాత్రం ఫీజుల దడ మొదలైంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు కార్పొరేట్ చదువులు పెద్ద గండంలా మారుతోంది. అడ్మిషన్లు, ఫీజులు, బడి సామగ్రి కొనుగోళ్లు అంటూ కుటుంబాలపై మోయలేని ఆర్థిక భారం పడుతోంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అడ్మిషన్లు తల్లిదండ్రులకు గుబులు రేపుతున్నాయి.
భారీగా పెరిగిన ఫీజులు
కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ ఫీజు లు, బిల్డింగ్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు.. ఇలా అనేక పేర్లతో తల్లి దండ్రుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేశాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి స్కూల్ ఫీజులను ఏకంగా 30 నుంచి 50 శాతం వరకు పెంచేయడం గమనార్హం. కొత్తగా పాఠశాలలో చేర్పించడానికే రూ.40 వేలకు పైగా ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో పిల్లలను చదివించడం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని తల్లిదండ్రులు తెలుపుతున్నారు.


