చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి నీటి బొట్టునీ ఒడిసి పట్టడమే లక్ష్యమని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ స్పష్టం చేశారు. మంగళ వారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారు లతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించుకున్న 100 శాతం రుణ లక్ష్యాలను బ్యాంకర్లు తప్పనిసరిగా సాధించాలని స్పష్టం చేశారు. జిల్లా లోని డెయిరీలు, రైతులతో సమన్వయం చేసుకొని ఈ విభాగంలో రుణాల పంపిణీని మరింత వేగవంతం చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి (2026–27) సంబంధించి జిల్లాలోని 13,444 స్వయం సహాయక సంఘాలకు రూ.2066.45 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేయడానికి వివిధ బ్యాంకులు ఆమోదం తెలపడం శుభపరిణామమన్నారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ షేక్ ఇనూస్, ఇండియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ మేనేజర్ హేమమాలతి, ఆర్‌బీఐ ఎల్‌బీఓ రోహిత్ అగర్వాల్, నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, వివిధ బ్యాంకుల రీజినల్ మేనేజర్లు పాల్గొన్నారు.
ఆ అర్జీలను తిరస్కరించొద్దు
సివిల్ వివాదం పేరుతో అర్జీలను తిరస్కరించకూడదని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. విజయవాడ నుంచి సీసీఎల్‌ఏ అధికారులు నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా పీజీఆర్‌ఎస్‌లో ప్రజల సంతృప్తి స్థాయిని అంచనా వేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి సోమవారం అందుతున్న పిటిషన్లలో 75 నుంచి 80 శాతం వరకు కుటుంబ సభ్యుల మధ్య భూ హక్కులు, వారసత్వ హక్కులు, సరిహద్దు వివాదాలు వంటి వ్యక్తిగత సమస్యలే ఉంటున్నట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులు ఇది సివిల్ వివాదం.. కోర్టుకు వెళ్లండి అని చెపుతూ అర్జీలను సింపుల్‌గా తిరస్కరించకూడదని స్పష్టం చేశారు.
జలధార పనులు పూర్తిచేయండి
జిల్లాలో భూగర్భ జలాల పెంపుదల, వర్షపు నీటి సంరక్షణ కోసం చేపట్టిన జలధార–నీటి భద్రత కార్యక్రమ పనులను ఈనెల 25లోపు వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, డ్వామా, పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో భూగర్భ జలాల మట్టం దాదాపు ఆరు మీటర్ల మేర పడిపోవడంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో జలధార పథకంలో ఇప్పటివరకు 1,482 పనులను గుర్తించగా, 1,355 పనులను ప్రభుత్వం మంజూరు చేసిందని, అందులో 546 చెరువు పనులు పూర్తయ్యాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ రవికుమార్, ఇరిగేషన్ ఎస్‌ఈ వెంకటేశ్వరరాజు, అగ్రికల్చర్ జేడీ మురళి తదితరులు పాల్గొన్నారు.


