ప్రొబేషన్‌పై నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రొబేషన్‌పై నిర్లక్ష్యం

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

రెండేళ్లు దాటినా ప్రకటించని వైనం

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పేరుతో పెండింగ్‌లో ఫైళ్లు

రాష్ట్ర స్థాయి ఆదేశాలు ఉన్నా ముందుకు కదలని ప్రక్రియ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ప్రొబేషన్‌ ప్రకటన కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వైద్యారోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, హెల్త్‌ అసిస్టెంట్లు తదితర ఉద్యోగులు పడరానిపాట్లు పడుతున్నారు. నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత ప్రొబేషనన్‌ ప్రకటించాల్సి ఉంది. అయితే జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఇప్పటి వరకు ఆ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డీఎస్సీ ద్వారా నిర్వహించిన నియామకాల్లో మెరిట్‌ ఆధారంగా ఎంపికై న అభ్యర్థులకు రెగ్యులర్‌ నియామకాలు కల్పించారు. జిల్లాలో ఫార్మసిస్టులు 22, ల్యాబ్‌టెక్నీషియన్‌ 18, హెల్త్‌ అసిస్టెంట్‌ 94 మంది అప్పట్లో రెగ్యూలరయ్యారు. నియామకాల సమయంలోనే విద్యార్హతల ధృవీకరణ, పోలీసు వెరిఫికేషన్‌న్‌, ఇతర అన్ని ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాతే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అయినప్పటికీ ప్రొబేషన్‌ ప్రకటించే దశకు వచ్చేసరికి సర్టిఫికెట్ల ధృవీకరణ అంశాన్ని కారణంగా చూపుతూ అధికారులు ఫైళ్లను పెండింగ్‌లో ఉంచుతున్నారు. కొంతమంది ఉద్యోగులు చదివిన విద్యాసంస్థలు ప్రస్తుతం మూతపడ్డాయి. వాటి రికార్డులు గతంలో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనివల్ల వెరిఫికేషన్‌లో జాప్యం జరుగుతోందని సమాచారం. అయితే ఆ పరిస్థితికి తమకు ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వమే అన్ని ధృవీకరణలు పూర్తిచేసి ఉద్యోగాల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే అంశాన్ని అడ్డంకిగా చూపడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్ర ఇంటెలిజెనన్స్‌ నుంచి సంబంధిత అధికారులకు అవసరమైన పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని సూచనలు వెళ్లినట్లు తెలుస్తోంది.

బెనిఫిట్లు దూరం

ప్రొబేషన్‌న్‌ ప్రకటించకపోవడంతో ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, ఉన్నత ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అవకాశాలు, ఇతర సర్వీస్‌ ప్రయోజనాలు కూడా ఆలస్యమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ భవిష్యత్తు, ఉద్యోగ భద్రత రెండూ ప్రశ్నార్థకంగా మారాయని వాపోతున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పెండింగ్‌లో ఉన్న సర్టిఫికెట్‌ ధవీకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, అర్హులైన ఉద్యోగుల ప్రొబేషనన్‌ను వెంటనే ప్రకటించాలని బాధిత ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆవేదనలో

వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement