రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

బైరెడ్డిపల్లె: మండల పరిధిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బైరెడ్డిపల్లె– కుప్పం జాతీయ రహదారిలోని ఆయిమాత ఆలయం వద్ద ద్విచక్ర వాహనంపై వికోట వైపు వెళ్తున్న సంజయ్‌కి కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి బోల్తా పడ్డాడు. ఈ ఘటనలో సంజయ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని 108 సిబ్బంది బైరెడ్డిపల్లె ఆస్పత్రికి తరలించారు. అలాగే బైరెడ్డిపల్లె–పుంగనూరు రహదారిలోని నల్లగుట్టపల్లె క్రాస్‌ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పశ్చిమబెంగాల్‌ నుంచి కోళ్లపారంలో పనిచేయడానికి వచ్చిన సైముద్దీన్‌, అతని స్నేహితుడు లక్కనపల్లెలో ఇంటి సరుకులు తీసుకొని వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

ఎస్సీ యువతకు సువర్ణావకాశం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ఎస్సీ యువతకు సువర్ణావకాశం లభించిందని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీదేవి తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన నిరుద్యోగ యువతీయువకులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మంచి అవకాశం కల్పిస్తున్నారన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన పథకంలో జిల్లాలో ప్రత్యేక స్కిల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ మీటింగ్‌ హాల్‌లో ఈ నెల 18న ఉదయం 10.30 గంటలకు మేళా ఉంటుందన్నారు. మేళాలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రముఖ నైపుణ్యాభివృద్ధి సంస్థల ప్రతినిధులు, తదితర సంస్థల నిర్వాహకులు పాల్గొంటారన్నారు. యువతకు వారి విద్యార్హతలకు అనుగుణంగా ఏయే రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి? ఏయే నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి? అనే అంశాలపై ఉచిత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. సొంతంగా వ్యాపారాలు, స్వయం ఉపాధి యూనిట్‌లు ఏర్పాటు చేసుకోవాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులకు ప్రభుత్వ సబ్సిడీ సంక్షేమ పథకాల వివరాలను అందిస్తారన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటా, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, విద్యార్హత సర్టిఫికెట్‌లు, మార్కుల మెమోలు తీసుకురావాలని ఈడీ కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement