మ్యాపింగ్‌ కాని ఓటర్లు 9,33,387 మంది | - | Sakshi
Sakshi News home page

మ్యాపింగ్‌ కాని ఓటర్లు 9,33,387 మంది

Jun 16 2026 1:52 AM | Updated on Jun 16 2026 1:52 AM

మ్యాపింగ్‌ ముఖ్యం.. లేదంటే

ఓటు గోవిందా

తిరుపతి, చిత్తూరు జిల్లాలో మ్యాపింగ్‌ కాని ఓటర్లు 9.33 లక్షలకుపైనే

అత్యధికంగా మ్యాపింగ్‌లో లేని నియోజక వర్గాలు తిరుపతి,చంద్రగిరి

ఓటు వజ్రాయుధం.. పాశుపతాస్త్రం.. భారత రాజ్యాంగం మనిషికి కల్పించిన గొప్ప హక్కు. అలాంటి ఓటును కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్‌) పేరుతో ఓ కార్యక్రమం మొదలైంది. ప్రతి ఓటరూ మేల్కొని తమ వివరాలను బీఎల్వోలకు అందజేసి, ఓటుహక్కును కాపాడుకోవాల్సి ఉంది.

చిత్తూరు జిల్లా..

నియోజక వర్గం పేరు మొత్తం ఓటర్లు మ్యాపింగ్‌ మ్యాపింగ్‌ అయిన ఓటర్లు కాని ఓటర్లు

చిత్తూరు 2,03,536 1,37,304 66,232

పూతలపట్టు 2,22,755 1,78,925 43,830

పలమనేరు 2,72,326 2,20,132 52,194

పుంగనూరు 2,41,106 1,87,627 53,479

నగరి 2,03,745 1,66,681 37,064

గంగాధరనెల్లూరు 2,06,670 1,67,931 38,739

కుప్పం 2,30,474 1,79,534 50,940

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రతి పౌరునికి అతి ముఖ్యమైన ఓటు హక్కుని కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఓటరు కాస్త నిర్లక్ష్యం చేస్తే.. ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ‘సర్‌’ హెచ్చరిస్తోంది. ఇప్పటివరకు ఎన్నిసార్లు ఎన్నికల్లో పాల్గొన్నా.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా విధిగా ఎన్యూమరేషన్‌ ఫారం పూర్తి చేయాలి. సకాలంలో ఆ ఫారాలు ఇచ్చిన వారి ఓట్లు మాత్రమే భద్రంగా ఉంటాయి. లేదంటే ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పన పేరుతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇందులో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్‌) మ్యాపింగ్‌ ప్రక్రియ కీలకంగా మారింది. సమగ్ర ప్రత్యేక సవరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగుతుంది. సర్‌లో ప్రధానంగా మూడు రకాల మ్యాంపింగ్‌ల గురించి ప్రతి ఓటరు అవగాహన ఉండాలనే విషయం స్పష్టమైంది. ఓటు భద్రంగా ఉండాలంటే వచ్చే నెల 14వ తేదీ లోపు మ్యాపింగ్‌ పూర్తి చేసుకోవాలి. అందుకోసం ప్రతి ఓటరు పుట్టిన గ్రామానికి వెళ్లాలి. 2002 ఓటరు జాబితాలో మీ తల్లి దండ్రుల పేరు, సీరియల్‌ నంబర్‌ తెలుసుకుని.. ఆ నంబర్‌ని బీఎల్వోలకు ఇవ్వాలి. వారు ఆ నంబర్‌తో ఓటరు జాబితాలో మ్యాపింగ్‌ ద్వారా చేరుస్తారు. 2002 ఓటరు లిస్టులో పేరు ఉండి, 2025 జాబితాలో కూడా పేరు ఉన్న వారు బీఎల్వో దగ్గరకు వెళ్లి సెల్ఫ్‌ మ్యాపింగ్‌ చేయించుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ‘సర్‌’ స్పష్టం చేస్తోంది.

సర్‌ ప్రక్రియ ప్రారంభం

తిరుపతి, చిత్తూరు జిల్లాలో మ్యాపింగ్‌ కాని ఓటర్లు 9,33,387 మంది ఉన్నారు. ఇందులో తిరుపతి జిల్లాలోనే 5,90,909 మంది ఉంటే.. చిత్తూరు జిల్లాలో 3,42,478 మంది ఓటర్లు ఉన్నారు. తిరుపతి, చంద్రగిరి నియోజక వర్గాల పరిధిలో ఎక్కువ మంది మ్యాపింగ్‌ చేయని ఓటర్లు ఉన్నారు. ఆ తరువాత స్థానంలో శ్రీకాళహస్తి, వెంకటగిరి, రైల్వేకోడూరు, చిత్తూరు నియోజక వర్గాలున్నాయి. నెల రోజుల్లోపు ఓటర్లు మ్యాపింగ్‌ చేసుకోలేకపోతే ఓటుహక్కు కోల్పోయే ప్రమాదమే అధికంగా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంటింటా సర్వే పూర్తయిన తరువాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఈ జాబితా ప్రతి బీఎల్వో వద్ద ఉంటుంది. ఆ జాబితాలో ఓటు ఉందో లేదోనని ప్రతి ఒక్కరు విధిగా సరిచూసుకోవాల్సి ఉంది. జాబితాలో పేరు లేకపోతే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఆ అభ్యంతరాలను ఆగస్టు 20వ తేదీలోపే స్వీకరిస్తారు. అలా ఇచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్‌ 18వ తేదీలోగా పరిష్కరించి, అదే నెల 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. జూలై ఒకటో తేదీ లోగా 18 ఏళ్లు పూర్తి అయినా కొత్త్తగా ఓటరు నమోదు కాకపోతే ఫారం–6 ద్వారా నమోదు చేసుకోవచ్చు. జాబితాలో ఓటు లేకపోతే ఫారం–7.. వేరే చోటుకు ఓటు బదలాయించడానికి ఫారం–8ని వినియోగించుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement