పుష్పాభిషేకం! | - | Sakshi
Sakshi News home page

పుష్పాభిషేకం!

Jun 16 2026 1:52 AM | Updated on Jun 16 2026 1:52 AM

కార్వేటినగరం: రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి వారికి సోమవారం పుష్పయాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి సంప్రదాయ పుష్పాలు, తులసి, మరువం వంటి ఆరు రకాల పత్రాలు కలిపి టన్ను పుష్పాలతో పుష్పాభిషేకం చేశారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన భక్తులతోపాటు స్థానికులు పుష్పాలను విరాళంగా సమర్పించారు. జూన్‌ 6 నుంచి 14వ తేదీ వరకు వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెల్సిందే. ఈ సమయంలో అర్చకులు, పరిచారకులు, అధికారులు, అనధికారులు, భక్తుల కారణంగా జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సోమవారం ఉదయం రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం కంకణబట్టు మురళీకృష్ణ ఆధ్వర్యంలో పుష్పయాగం చేపట్టారు. తదనంతరం స్వామివారు తిరుచి వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. రాత్రి స్వామివారి ఏకాంత సేవ నేత్రపర్వంగా సాగింది. డెప్యూటీ ఈఓ నాగరత్న, సూపరింటెండెంట్‌ శ్రీనివాసులురెడ్డి, ఆలయ అధికారి చంగల్‌రాజు పాల్గొన్నారు.

డయేరియా నివారణే లక్ష్యం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో డయేరియా నివారణే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో డయేరియా నివారణపై అవగాహన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. చిన్నపిల్లల్లో డయేరియా ప్రాణాంతకంగా మారకుండా చూసేందుకు ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది జూన్‌ 16 నుంచి జూలై 31వ తేదీ వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య–వెల్నెస్‌ కేంద్రాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రత్యేకంగా ఓఆర్‌ఎస్‌–జింక్‌ కార్నర్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా ఆహారం తినే ముందు, పిల్లలకు తినిపించే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి అలవాట్లను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. డీఎంహెచ్‌వో నాగశశిభూషన్‌రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి హనుమంతరావు, డీసీహెచ్‌ఎస్‌ పద్మాంజలిదేవి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement