అక్షరం ముక్క..
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలపై జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. తమ పిల్లలను కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలనుకునే తల్లిదండ్రుల నుంచి ఫీజుల దగ్గర నుంచి పుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ, బస్సు చార్జీల పేర్లతో అందిన కాడికి దోచుకుంటున్నారు. పుస్తకా లు, యూనిఫాం, స్టేషనరీ తదితరాలను పాఠశాలల్లోనే నేరుగా అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. హైటెక్ పేర్లతో కనిపించే పాఠశాలల్లో కనీసం మౌలి క సదుపాయాలు ఉండడం లేదు. అపార్ట్‌మెంట్ భవనాల్లో తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రభు త్వ నిబంధనలను అతిక్రమిస్తున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆయా పాఠశాలలపై ఎవరైనా ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూ.20 వేల నుంచి
రూ.1.75 లక్షల వరకు ఫీజులు
విద్యాశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 431 కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వీటిలో 2 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇవి కాకుండా అనుమతులు లేని మరో 50 పాఠశాలలున్నట్లు విద్యాశాఖ అధికారులే చెబుతున్నారు. వీటిలో ఎల్‌కేజీ నుంచి 10 వ తరగతి వరకు విద్యాబోధనకు పాఠశాలను బట్టి రూ.20 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. మొత్తం ఫీజులో 50 శాతం స్కూల్లో చేరినప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన ఫీజు రెండు దఫాలుగా చెల్లించాలి. ఫీజుల స్ట్రక్చర్‌ను నోటీసు బోర్డులో ఉంచాలన్న నిబంధన ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. పేరెంట్స్ కమిటీలు ఉండడం లేదు. ఫీజులకు తగ్గ వసతులు కనిపించవు. విద్యార్థులను గాలి, వెలుతురు లేని గదుల్లో ఉంచి బోధన చేస్తున్న దుస్థితి.
ఇష్టానుసారంగా ప్రత్యేక ఫీజులు
విద్యార్థుల నుంచి ట్రాన్స్‌ఫోర్ట్ పేరుతో మరో వ్యాపారానికి తెరతీశారు. తక్కువ దూరానికి సైతం రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు వసూలు చేస్తున్నారు. విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ, పాఠశాల వార్షికోత్సవ వేడుకల పేరుతో అదనంగా రూ.2 వేల నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నారు.
జిల్లాలోని పాఠశాలల వివరాలు
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు 431
చదువుతున్న విద్యార్థులు 2 లక్షల మంది
పుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ
రూ.15 వేలు (ఒక్కో విద్యార్థికి సగటున)
మొత్తం వ్యాపారం రూ.400 కోట్లు
12 శాతం జీఎస్‌టీ వసూలైతే
రూ.48 కోట్లు
జీవో నంబర్ 1 అనుసరించడం లేదు
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు జీవో నంబర్ 1ని అనుసరించడం లేదు. ఫీజుల వివరాలు నోటీసు బోర్డుల్లో పెట్టడం లేదు. పుస్తకాలు, యూనిఫాం, ఇతర విద్యాసామగ్రిని పాఠశాలల్లోనే విక్రయిస్తున్నారు. ఫీజులు ఇష్టానుసారం పెంచేసి తల్లిదండ్రులను దోచుకుంటున్నారు. ఈ విషయం విద్యాశాఖ అధికారులకు సైతం తెలుసు. ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకోవడం లేదు. అధిక ఫీజులు కట్టడి చేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం. – ప్రవీణ్‌కుమార్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి


