ముందుగా కాలుజారి కుంటలో పడ్డ కుమారుడు
కొడుకుని కాపాడబోయి గుంతలోకి దిగిన తల్లి
ఈత రాక ఇద్దరూ మృతి
నెలవాయి గ్రామంలో విషాదం
శ్రీరంగరాజపురం : రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం వారిది. దంపతులిద్దరూ రోజూ పనికెళ్లితేగానీ ఐదేళ్లూ నోటికందవు. రోజూలాగే భార్య కూలిపనికెళ్లిగా.. భర్త వెల్డింగ్ పనికెళ్లాడు. ఆదివారం సెలవు దినం కావడంతో పదో తరగతి చదువుతున్న కొడుకు కూలి పని చేస్తున్న తల్లి వద్దకెళ్లాడు. పక్కనే ఉన్న మామిడితోటలో మామిడి పండ్లు తిని చేయి కడుక్కునేందుకు అక్కడున్న ఓ గుంతలో దిగాడు. అంతే..! కాలుజారి పడిపోయాడు. గమనించిన తల్లి కొడుకుని రక్షించేందుకు తనూ గుంతలో దిగేసింది. ఇద్దరికీ ఈత రాకపోవడంతో ఊపిరాడక మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన ఎస్సార్‌పురం మండలం నెలవాయిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు.. నెలవాయి గ్రామానికి చెందిన సోమశేఖర్(చిట్టీ), రేవతి(35) దంపతులకు ఆస్తిపాస్తులు లేవు. చిట్టీ వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. భార్య రేవతి రోజువారీ కూలిపనులకెళ్తూ తోడ్పాటునందిస్తోంది. రోజూ మాదిరిగానే రేవతి ఆదివారం నెలవాయి గ్రామానికి చెందిన రఘుపతినాయు డు పొలంలో కూలి పనికెళ్లింది. సెలవు దినం కావడంతో కొడుకు సిద్ధూ తల్లివద్దకెళ్లాడు. పక్కనే ఉన్న మామిడి తోట లో మామిడి పండ్లు తిని.. చేయి కడుక్కునేందుకు అక్కడే ఉన్న ఓ గుంతలో దిగబోయాడు. కాలు జారడంతో నీటిలో పడిపోయాడు. గమనించిన తల్లి పరుగున వచ్చి కొడుకుని రక్షించేందుకు గుంతలోకి దిగింది. ఆ గుంత సుమారు 15 అడుగుల లోతు వరకు ఉండడంతో ఇద్దరూ ఊపిరాడక మృత్యుఒడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు గుంత వద్దకు చేరుకుని తల్లీకొడుకుల మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సుమన్ పేర్కొన్నారు.
అంతులేని విషాదం
కార్వేటినగరం మండలం, డీఎంపురం గ్రామానికి చెందిన రేవతిని 16 ఏళ్ల క్రితం చిట్టీ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి కుమారుడు సిద్ధూ, కుమార్తె సౌమ్యశ్రీ ఉన్నారు. గుంతలోకి దిగి తల్లీకొడుకు మృతిచెందగా.. చిట్టీ, కుమార్తె సౌమ్యశ్రీ దిక్కులేనివారిగా మిగిలారు. ‘నేను ఎలా బతికేదమ్మా..! నాకు దిక్కెవరు తల్లీ..?.. అంటూ ఆ కుమార్తె గుండెలవిసేలా రోదించడం చూపరులకు కన్నీళ్లు తెప్పించింది.
పెనవేసుకున్న పేగు బంధం కళ్లెదుటే నీటిలో పడి అల్లా డుతుంటే తట్టుకోలేకపోయింది. ప్రాణాలకు తెగించి గుంతలో దిగి కొడుకుని రక్షించేందుకు యత్నించింది. ఊపిరి పోతున్నా ఎలాగైనా కుమారుడ్ని కాపాడాలని పోరాడింది. కానీ చివరకు మృత్యువే జయించింది. తల్లీకొడుకులిద్దర్నీ పొట్టనబెట్టుకుని కన్నీళ్లు మిగిల్చింది. కుమార్తెను అనాథను చేయగా.. భర్తను వీధిన పడేలా చేసింది. ఈ ఘటన ఎస్సార్‌పురం మండలం, నెలవాయి గ్రామంలో పెను విషాదాన్ని మిగిల్చింది.
తల్లీకొడుకుని మింగేసిన గుంత


