నేడు అన్ని సంబంధాలు ఆర్థికంగా మారి పోయాయి. మానవ సంబంధాలు, మానవ విలువలు దిగజారిపోతున్నాయి. ఆదాయం వస్తుందంటేనే పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక అన్న తన తమ్ముడికి అన్నీతానై నిలిచాడు. కాంట్రాక్టు ఉద్యోగిగా తక్కువ జీతం వస్తున్నా నాకెందుకులే అని అనుకోలేదు. మానసిక వికలాంగుడని చీదరించుకోలేదు. బిడ్డలా సేవ చేస్తున్నాడు. కన్నబిడ్డలకంటే మిన్నగా చూసుకుంటున్నాడు.
శాంతిపురం: మండలంలోని కర్లగట్టకు చెందిన అబ్బయ్య, ఎల్లమ్మ దంపతులకు ముగ్గు రు కొడుకులు. ఒక కుమార్తె సంతానం. పెద్ద కొడుకు జి.వెంకటేష్ కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రెండవ వాడు వెంకటముని వృత్తిరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. మూడో వాడు చిన్నకుట్టి అలియాస్ విజయ్‌కుమార్(33) చిన్నతనం నుంచి అమాయకుడిగా ఉండేవాడు. ఏడో తరగతి వరకు చదివాడు. దండికుప్పంలోని బ్రిడ్జి స్కూలులో చేర్పించినా చదువు ముందుకు సాగలేదు. 2006లో తల్లి మరణం తర్వాత చిన్నకుట్టి మానసికంగా బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు గమనించి వైద్యం చేయించడం మొదలు పెట్టా రు. 2020లో తండ్రి మరణం తర్వాత అతని ఆరోగ్యం మరింత దిగజారింది. కుటుంబ సభ్యుల మాట పట్టించుకోకుండా, ఇంటి పట్టున ఉండకుండా ఇరుగుపొరుగు గ్రామాల్లో తిరిగేవాడు. అన్న వెంకటేష్ అతని బాగోగులు చూసుకోవడం ప్రారంభించాడు. 2023లో అతన్ని పలమనేరులో ఓ ఎన్‌జీవో సంస్థ నడుపుతున్న మానసిక వికలాంగుల కేర్ హోమ్‌లో చేర్పించాడు. అక్కడ కూడా ఉండకుండా చిన్నకుట్టి తప్పించుకున్నాడు. తర్వాత తనను పట్టుకుని బెంగళూరులోని నిమ్‌హాన్స్, కుప్పం పీఈఎస్ ఆస్పత్రిలో వైద్యం కొనసాగిస్తున్నారు.
సాయం చేస్తున్న దయామయులు:
తమ్ముడి పట్ల వెంకటేష్ చూపుతున్న బాధ్యతను గమనించిన స్థానికులు కొందరు అతనికి సహకరిస్తున్నారు. చిన్నకుట్టి ఉనికిని ఎప్పటికప్పుడు అన్నకు తెలియజేయడం, ఆ రోజు మాత్రలు వేసుకున్నాడా? లేదా అని తెలుసుకుని మాత్రలు మింగించడం చేస్తున్నారు. చిన్నకుట్టి ఎక్కువగా ఏడోమైలు ప్రాంతంలోనే ఉండడంతో అక్కడ హోటళ్ల యజమానులు భోజనం పెడుతూ తర్వాత బిల్లు తీసుకుంటున్నారు.
చంటి బిడ్డలా సేవలు
ఇంటి పట్టున ఉండకుండా తిరుగుతున్న తమ్ముడి ఉనికిని వెంకటేష్ గ్రామస్తుల సహకారంతో తెలుసుకుంటూ ఏ గ్రామంలో ఉన్నా మాత్రలు ఇచ్చేలా ఏర్పాటు చేసుకున్నాడు. దీనికోసం ఆయా గ్రామాలకు చెందిన వారి వద్ద మాత్రలు సిద్ధంగా ఉంచాడు. తమ్ముడు రాత్రి పూట ఏడవమైలు, కాలిగానూరు, కడపల్లి గ్రామాలకు వస్తే అక్కడ ఉండేందుకు అవసరమైన సామగ్రిని ఏర్పాటు చేశాడు. ఆఫీసు నుంచి త్వరగా వచ్చిన రోజు స్థానికుల సమాచారంతో తమ్ముడిని వెతికి కలిసి యోగక్షేమాలు విచారిస్తున్నాడు. ఆదివారం వస్తే తమ్ముడికి షేవింగ్ చేయించడం, జుట్టు కత్తిరించడం, స్నానం చేయించడం వ్యాపకంగా పెట్టుకున్నాడు. డాక్టర్లు చెప్పిన రోజున తమ్ముడిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేస్తున్నాడు. వెంకటేష్ భార్య, ఇద్దరు పిల్లలు పొరుగున ఉన్న కర్ణాటకలో ఉంటుంటే తమ్ముడి బాధ్యతల తర్వాతే వారికి సమ యం కేటాయిస్తున్నాడు.


