బైరెడ్డిపల్లె : బైరెడ్డిపల్లె చెక్‌పోస్టు కూడలిలోని నాగరాజునాయుడు దుకాణంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణానికి ఏర్పాటు చేసిన రేకులను తొలగించి లోనికి ప్రవేశించి వస్తువులతో పాటు సిగిరేట్లు ఎత్తుకెళ్లారు. బాధితుడు ఆదివారం ఉదయం దుకాణం వద్దకు వెళ్లగానే చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం డీకొని వైద్యుడి మృతి
పూతలపట్టు(యాదమరి): గుర్తుతెలియని వాహ నం డీకొని ఓ యువ వైద్యుడు మృతిచెందిన ఘటన మండలంలో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం.. పాకాల మండలం, పచ్చిపాలపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ అభిషేక్(29) భార్యతో కలసి చిత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులుగా విధులు నిర్వర్తిస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే ఆయన సొంత గ్రామం పచ్చిపాలపల్లిలోని స్వగృహంలో ఇటీవల చోరీ జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం పాకాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి ద్విచక్ర వాహనంలో చిత్తూరుకు తిరుగు పయనమయ్యాడు. మండల పరిధి కిచ్చన్నగారిపల్లి సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం డీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ బోల్తా
కుప్పం రూరల్ : మండలంలోని కుప్పం – క్రిష్ణగిరి జాతీయ రహదారిలో ఆదివారం ఉదయం లారీ బోల్తాపడి డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. లారీ పత్తి లోడుతో గుర్గావ్ నుంచి తమిళనాడు రాష్ట్రం ఈరోడ్డుకు వెళ్తోంది. మార్గమధ్యంలో కుప్పం మండలం నడుమూరు మోడల్ పాఠశాల వద్ద ఉన్న మలుపులో ఆదివారం ఉదయం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ మాధవ్‌కు తలపై స్వల్ప గాయమైంది. క్లీనర్‌కు గాయాలు కాలేదు. స్థానికులు డ్రైవర్ మాధవ్‌ను చికిత్స నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మలుపు వద్ద నెలలో నాలుగు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
రెండు స్కూటర్లు ఢీకొని
ఇద్దరికి తీవ్ర గాయాలు
తవణంపల్లె : మండలంలోని చిత్తూరు– అరగొండ ప్రధాన రహదారిలో ఉన్న షికారీ కాలనీ వద్దనున్న మలుపులో ఆదివారం రెండు స్కూటర్లు ఢీన్నాయి. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ రమేష్‌బాబు కథనం మేరకు.. చిత్తూరు పట్టణం కన్నయ్యనాయుడు కాలనీకి చెందిన వి.రాజశేఖరన్, అతని తమ్ముడు వి.శ్రీనివాసన్ ద్విచక్ర వాహనంలో అరగొండ నుంచి చిత్తూరు బయలుదేరారు. అదేసమయంలో గంగనపల్లెకు చెందిన మహిళ స్కూటర్‌లో వస్తోంది. షికారీ కాలనీ వద్దనున్న మలుపులో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో రాజశేఖరన్, శ్రీనివాసన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజశేఖరన్‌కు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వేలూరులో ని నర్వీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. రాజశేఖరన్ అల్లుడు పవన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
ఎక్కడున్నారు సారూ!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ఈనెల 15 నుంచి ప్రారంభం కానుంది. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా శని, ఆదివారాల్లో బీఎల్‌ఓలు పోలింగ్ కేంద్రాల్లో ఉండి మ్యాపింగ్ చేయాలని అధికారులు ఆదేశించారు. కొన్ని కేంద్రాల్లో బీఎల్‌ఓలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉన్నారు. తర్వాత పత్తాలేకుండా పోయారు. చిత్తూరులోని దొడ్డిపల్లె, రాంనగర్‌కాలనీ, కట్టమంచి, కొంగారెడ్డిపల్లె ప్రాంతాల్లో పలువురు బీఎల్‌ఓలు గైర్హాజరయ్యారు. నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు ప్రాంతాల్లో కొన్ని పాఠశాలల తలుపులు తెరుచుకోనేలేదు. ఎలాగూ ఇంటింటికి వెళ్తాం కదా.. అన్నధోరణిలో పలువురు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఎల్‌ఓల పనితీరుపై పర్యవేక్షణ చేయాల్సిన సూపర్‌వైజర్లు సైతం అటు వైపు తొంగిచూడలేదు. చివరికి పలువురు ఓటర్లు నిరీక్షించి చేసేదేమిలేక వెనుదిరిగారు.


